ఒక సర్వేతో అందరికి మంట పుట్టించేలా చేసిన కోమటిరెడ్డి

Update: 2021-07-29 08:26 GMT
తరచూ ఏదో ఒక విషయానికి సంబంధించి వార్తల్లో నిలుస్తుంటారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టీపీసీసీ పదవిని ఆశించిన ఆయన ఆశ తీరలేదు. మౌనంగా ఉంటూనే.. అప్పుడప్పుడు తన మాటలతో మంట పుట్టించే టాలెంట్ ఆయనలో ఎక్కువ. అలాంటి ఆయన తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది హుజూరాబాద్ ఉప ఎన్నిక. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన స్థానానికి త్వరలో ఎన్నిక జరగాల్సి ఉంది.

ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందన్న దానిపై స్పష్టత లేకున్నా.. ఎవరికి వారు అస్త్రశస్త్రాలతో సమాయుత్తం అవుతున్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రిపరేషన్ లో నిమగ్నమయ్యారు. ఈ విషయంలో తెలంగాణ అధికారపక్షం చురుగ్గా ఉండటమే కాదు.. ఎన్నికల తాయిలాల్ని ముందస్తుగా ఓటర్లకు చేరేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా సీనియర్ నేత గోనెప్రకాశ్ రావు ఆరోపణలు ఉన్నాయి. ఆయన లెక్క ప్రకారం ఇప్పటికే కొన్ని వందల కోట్లు ఓటర్లకు చేరేలా గులాబీదళం ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు.

మరోవైపు.. ఈటల రాజేందర్ సైతం తన ప్రయత్నాల్లో తాను ఉన్నట్లు చెబుతున్నారు. తన గెలుపు తన రాజకీయ భవిష్యత్తుకు జీవన్మరణ సమస్యగా మారటంతో.. ఇప్పుడాయన ఆయన శక్తియుక్తులతో పాటు.. తన అస్త్రాల్ని ఉప ఎన్నికల్లో సంధించటానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారున్న వేళ.. కోమటిరెడ్డి చేయించినట్లుగా చెబుతున్న సర్వే ఫలితాల మీద సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
కోమటిరెడ్డి సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగితే ఈటల రాజేందర్ కే గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆయనకు64 శాతం వరకు ఓటర్లు మొగ్గు చూపుతున్నారని.. టీఆర్ఎస్ కు గెలుపు అవకాశాలు కేవలం 30 శాతమే ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక.. రేవంత్ ఎంట్రీతో కాంగ్రెస్ పార్టీలో జోష్ ఎక్కువైనందన్న వేళ.. కోమటిరెడ్డి సర్వేలో మాత్రం ఐదు శాతం మాత్రమే ఓట్లు వచ్చే వీలుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దళితబంధు పథకంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక మొత్తంప్రభావితమవుతుందన్న అంచనాలు వినిపిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా కోమటిరెడ్డి సర్వే అంటూ బయటకు వచ్చిన సమాచారం ఇప్పుడు టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది.




Tags:    

Similar News