గాలి వార్త‌లంటూనే సెంట్ర‌ల్ హాల్లో అలా చేసిన రాజ‌గోపాల్!

Update: 2019-06-18 04:33 GMT
గ‌డిచిన రెండు మూడు రోజులుగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ హాట్ టాపిక్ గా మారారు. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయం బీజేపీనే అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఆయ‌న మాట‌లు చేత‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ఆయ‌న బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారా? అన్న ప్ర‌శ్న ప్ర‌ముఖంగా మారింది.పీసీసీ అధ్య‌క్ష పీఠాన్ని త‌మ‌కు ఇవ్వాల‌ని చెబుతూ.. మ‌రోవైపు బీజేపీవైపు చూస్తున్న తీరు చూస్తే.. ఆయ‌న పార్టీ మారేందుకు అవ‌స‌ర‌మైన ప్లాట్ ఫాంను సిద్ధం చేసుకుంటున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు పార్టీ మారే అంశంపై మ‌రింత న‌మ్మ‌కం క‌లిగేలా చేస్తున్నాయ‌ని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే ముందు నుంచి త‌మ‌కు పీసీసీ పీఠం ఇవ్వాల‌ని పార్టీని అడుగుతున్న‌ట్లుగా ఆయ‌న చెప్పారు. తొలుత పొన్నాల‌కు.. త‌ర్వాత ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి పీసీసీ చీఫ్ ప‌ద‌వి ఇవ్వ‌టం ద్వారా రాష్ట్రంలో రెండుసార్లు అధికారాన్ని కోల్పోయిన‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్యానించారు.

తాను బీజేపీలో చేరుతున్న‌ట్లుగా మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌న్ని గాలి వార్త‌లుగా కొట్టేసిన రాజ‌గోపాల్‌.. తాజాగా ఢిల్లీలోని పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్లో ఆయ‌న తీరు ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న సోద‌రుడు ప్ర‌మాణ‌స్వీకారానికి వ‌చ్చిన‌ట్లుగా చెప్పిన ఆయ‌న‌.. మాజీ ఎంపీ హోదాలో పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్ కు చేరుకున్నారు.

అక్క‌డ కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డితోనూ.. బీజేపీ ఎంపీ బండి సంజ‌య్ తోనూ చాలాసేపు మాట్లాడారు. అయితే.. వీరిద్ద‌రితో మాట్లాడితే తాను బీజేపీలోకి వెళుతున్న‌ట్లుగా వార్త‌లు మ‌రింత ఎక్కువ అవుతాయ‌ని అనుకున్నారో ఏమో కానీ.. కాంగ్రెస్‌.. టీఆర్ఎస్ ఎంపీల‌తోనూ ఆయ‌న కాసేపు ముచ్చ‌ట్లు పెట్ట‌టం క‌నిపించింది.

త‌మ‌తో మాట్లాడిన స‌మ‌యంలో కిష‌న్ రెడ్డి.. బండి సంజ‌య్ లు ఇద్ద‌రూ రాజ‌గోపాల్ ను పార్టీలోకి రావాల‌ని ఆహ్వానించిన‌ట్లుగా చెబుతున్నారు. వారి ఆహ్వానానికి స్పందించిన రాజ‌గోపాల్.. అందుకు స‌మ‌యం వ‌స్తుంద‌న్న మాట చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఓవైపు గాలి వార్త‌లు అంటూనే.. మ‌రోవైపు పాజిటివ్ గా రియాక్ట్ కావ‌టం.. పీసీసీ పీఠాన్ని కోరుకోవ‌టం చూస్తుంటే.. క్ర‌మ‌ప‌ద్ద‌తిలో రాజ‌గోపాల్ క‌మ‌ల‌నాథుడిగా రూపాంత‌రం చెంద‌టానికి ప‌క్కా ప్లాన్ వేసుకున్న‌ట్లుగా అనిపించ‌క మాన‌దు.


Tags:    

Similar News