కోమ‌టిరెడ్డి నోటి నుంచి బీజేపీ మాట వ‌చ్చిందంటే?

Update: 2019-06-16 05:28 GMT
తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయా? అంటే అవున‌నే మాట వినిపిస్తోంది. ఇటీవ‌ల ముగిసిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం తెలంగాణ‌లో రాజ‌కీయ ముఖ‌చిత్రంలో స్ప‌ష్ట‌మైన మార్పు చోటు చేసుకుంటోంది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో తెలంగాణ‌లో నాలుగు ఎంపీ సీట్ల‌ను సొంతం చేసుకోవ‌టంతో.. తెలంగాణ‌లో ఆ పార్టీకి ఉన్న ఇమేజ్ ఎంత‌న్న‌ది ఇప్పుడు అర్థ‌మైన ప‌రిస్థితి.

ద‌క్షిణాదిన పాగా వేయాల‌ని భావిస్తున్న క‌మ‌ల‌నాథుల‌కు తెలంగాణ ఫ‌లితం అనుకోని వ‌రంలా మార‌ట‌మే కాదు..కొత్త ఆశ‌ల‌కు తెర తీసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కాంగ్రెస్ లో ఉండే భ‌విష్య‌త్తు లేద‌న్న‌ట్లుగా ఉన్న నేత‌ల చూపు ఇప్పుడు బీజేపీ మీద ప‌డుతోంది. కేంద్రంలో ప‌వ‌ర్ ఫుల్ ప్ర‌భుత్వం ఉండ‌టం.. మోడీషా లాంటోళ్లు త‌లుచుకుంటే ఏమైనా చేస్తార‌న్న న‌మ్మ‌కం వారికి కొత్త ఆలోచ‌న‌లుక‌లిగేలా చేస్తున్నాయి.

దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌.. మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నార‌ని.. ఎవ‌రిని అడిగి పొత్తు కుదుర్చుకున్నార‌ని ప్ర‌శ్నించారు. పొత్తు కార‌ణంగా కాంగ్రెస్ తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌న్న ఆయ‌న‌.. రాష్ట్రంలో కాంగ్రెస్ కు భ‌విష్య‌త్తు లేకుండా పోయింద‌న్నారు.

డ‌జ‌ను మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో విలీన‌మైతే స‌రిగా స్పందించ‌లేద‌న్న ఆయ‌న‌.. తాజాగా షాకింగ్ వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ కు స‌రైన ప్ర‌త్యామ్నాయం బీజేపీనేన‌ని కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ నాయ‌క‌త్వం బ‌ల‌హీన‌ప‌డింద‌ని.. ఇప్పుడు కార్య‌క‌ర్త‌ల‌తో పాటు.. ప్ర‌జ‌లంతా బీజేపీవైపు చూస్తున్నార‌న్నారు.

ఇటీవ‌ల పార్టీ అధినాయ‌క‌త్వంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీల‌క నేత‌లు ప‌లువురు ర‌హ‌స్య చ‌ర్చ‌లు జ‌రిపార‌న్న వార్త రావ‌టం.. దానికి బ‌లం చేకూరేలా తాజాగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు కొత్త చ‌ర్చ‌కు తెర తీశాయి. రానున్న రోజుల్లో బీజేపీలో చేరేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ప‌లువురు సిద్ధంగా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News