నాకు రైతుబంధు ఎందుకు సీఎంగారూ?

Update: 2020-03-14 14:18 GMT
తెలంగాణలో రైతు బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, రైతు బంధు పథకం విధివిధానాల్లో లోపాలున్నాయని, ఈ పథకం ద్వారా కోటీశ్వరులైన రైతులకూ లబ్ధి కలుగుతోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ పథకంపై పరిమితి లేకపోవడం - వందల ఎకరాలకు ఆసాములైన వారి ఖాతాల్లోనూ డబ్బు జమకావడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో, రైతు బంధులో మార్పులు చేయాలని ప్రభుత్వం భావించినా...అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై అసెంబ్లీలో  మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. తన ఖాతాలోనూ రైతు బంధు కింద రూ.3లక్షలు జమయ్యాయని, తనలాంటి వాళ్లకు రైతు బంధు డబ్బులు ఎందుకని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

పేదరైతులకు రైతుబంధు అవసరమని, తనలాంటి బడా రైతులను ఇందులో నుంచి మినహాయించాలని కోమటి రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వెంటనే బెల్టు షాపులను ఎత్తివేయాలని - మద్యం మహమ్మారి వల్ల ఎంతోమంది పేదలు తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కరోనా కంటే భయంకరమైన బెల్టు షాపులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలు - కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, చనిపోయిన కార్మికులను తిరిగి తీసుకురాలేరని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆర్టీసీ సమ్మె వల్ల ఎవరు లాభపడ్డారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. 


   

Tags:    

Similar News