బీజేపీలో చేరే కోమటిరెడ్డికి..హస్తం భవిష్యత్తుపై బెంగెందుకో?

Update: 2019-09-10 01:30 GMT
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో బాగానే వినిపిస్తున్ పేరిది. కాంగ్రెస్ పార్టీ నేతగా - మాజీ ఎంపీగా - ప్రస్తుతం నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి... గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం నిమజేనన్న రీతిలో వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి... ఎన్ని రోజులు గడిచినా పార్టీ మారడం లేదు. అలాగని బీజేపీపై ప్రశంసలు మానడం లేదు. కాంగ్రెస్ పై విమర్శలనూ మానడం లేదు. మొత్తంగా నిత్యం లైమ్ లైట్ లోనే ఉండాలనుకుంటున్నారో - లేదంటే నిజంగానే పార్టీ మారే ఉద్దేశంతోనే ఉన్నారో... తెలియదు గానీ... తనదైన శైలి కామెంట్లు చేస్తూనే ఉన్నారు.

తాజాగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజనైన సందర్భంగా రాజగోపాల్ రెడ్డి కూడా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీల్లో తనకు కనిపించిన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ గా మాట్లాడారు. ఈ సందర్భంగానూ కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు గుప్పించిన కోమటిరెడ్డి... బీజేపీపైనా ప్రశంసలు కురిపించారు. టీ పీసీసీ చీఫ్ గా వ్యవహరిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీగా ఉన్న కుంతియాలు తమ పదవులకు రాజీనామాలు చేసి తప్పుకుంటే తప్పించి... తెలంగాణలో కాంగ్రెస్ బతకదని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి రాజీనామాలకు - పార్టీ భవిష్యత్తుకు ఎలాంటి లింకు ఉందో తెలియదు గానీ... వారిద్దరూ రాజీనామాలు చేస్తేనే గానీ... తెలంగాణలో కాంగ్రెస్ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని కోమటిరెడ్డి తెగేసి చెప్పేశారు.

అంతటితో కోమటిరెడ్డి ఆగినా సరిపోయేదేమో... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించుకునేందుకు ఓ వైపు తన సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్ర చేపట్టేందుకు పూనుకున్న విషయంతో పాటు రేవంత్ రెడ్డి చేయతలపెట్టిన పాదయాత్రపైనా రాజగోపాల్ రెడ్డి తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పాదయాత్రలు కాదు కదా... మోకాళ్ల యాత్రలు చేసినా కూడా ఫలితం లేదని కూడా వెంకటరెడ్డి సంచలన కామెంట్లు చేశారు. అయితే పాదయాత్ర చేయాలనుకుంటున్న కాంగ్రెస్ నేతల జాబితాలో మీ సోదరుడు ఉన్నారు కదా అని అడగ్గా... తన సోదరుడు అయినా పాదయాత్ర చేయని చూద్దామంటూ కూడా రాజగోపాల్ రెడ్డి మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఓ వైపు కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ బాధ్యులను తెగడుతూనే... బీజేపీపై కోమటిరెడ్డి ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో కమలం పార్టీ క్రమక్రమంగా పుంజుకుంటోందని - అధికార టీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని కూడా కోమటిరెడ్డి తేల్చి పారేశారు.

Tags:    

Similar News