కోమ‌టిరెడ్డి సీన్లోకి వ‌చ్చేశారు..

Update: 2018-10-05 10:53 GMT
తెలంగాణ రాజ‌కీయం వేడెక్కింది. ముంద‌స్తు పుణ్య‌మా అని ఇప్ప‌టికే వాడివేడిగా త‌యారైన వాతావ‌ర‌ణానికి గ‌డిచిన రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేస్తున్న ఘాటు వ్యాఖ్య‌లు ప‌రిస్థితిని మ‌రింత హాట్ హాట్ గా మార్చేశాయి. చంద్ర‌బాబును.. కాంగ్రెస్ పార్టీని బండ‌కేసి బాదేస్తున్న‌ట్లుగా కేసీఆర్ వ్యాఖ్య‌లు ఉండ‌టం చూస్తుంటే.. అదంతా వ్యూహాత్మ‌క దాడిగా అభివ‌ర్ణిస్తున్నారు.

న‌ల్గొండ జిల్లాలో జ‌రిగిన  స‌భ‌లో జిల్లాకు చెందిన 12 సీట్ల‌కు 12 సీట్లు టీఆర్ ఎస్ గెలుస్తుంద‌ని.. ఉత్త‌మ్ గోచీ ఊడిపోతుందంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై తాజాగా కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి స్పందించారు. త‌న‌దైన శైలిలో భారీ స‌వాల్‌ను కేసీఆర్‌కు విసిరారు. జిల్లాకు చెందిన 12 సీట్ల‌లో 10 సీట్లు కాంగ్రెస్ గెల‌వ‌ని ప‌క్షంలో తాను గెలిచినా త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని త‌న‌దైన శైలిలో స‌వాలు విసిరారు.

జిల్లాకు చెందిన మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి.. ఆయ‌న అనుచ‌రులు దోచుకునేందుకే దామ‌ర‌చ‌ర్ల థ‌ర్మ‌ల్ ఫ్లాంట్‌ ను నిర్మిస్తున్నార‌ని.. కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్లోకి వ‌స్తే ఆ ఫ్లాంట్‌ ను ఆపేస్తామ‌ని చెప్పారు. కాళేశ్వ‌రం పేరుతో రూ.30వేల కోట్ల దోచుకున్నార‌ని కేసీఆర్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. రౌడీల‌కు.. దోపిడీదారుల‌కు కేసీఆర్ టికెట్లు ఇచ్చార‌ని.. వారు కానీ ఎన్నిక‌ల్లో గెలిస్తే న‌ల్గొండ జిల్లాలో నిత్యం హ‌త్య‌లు.. దోపిడీలే అని వ్యాఖ్యానించారు.

తాను స‌వాల్ విసిరితే ఇట్టే స్పందిస్తాన‌ని.. కాంగ్రెస్ నేత‌లు విసిరిన స‌వాల్ తో తొమ్మిదినెల‌ల ముందే త‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి ఎన్నిక‌లకు ముందుకొచ్చిన‌ట్లుగా చెప్పే కేసీఆర్‌.. కోమ‌టిరెడ్డి స‌వాల్‌ కు స్పందిస్తారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. కోమ‌టిరెడ్డి చెప్పిన‌ట్లుగా ప‌న్నెండు సీట్ల‌లో ప‌ది సీట్లు గెల‌వ‌కుంటే తాను గెలిచినా.. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తానంటూ కోమ‌టిరెడ్డి చేస్తున్న‌ సంచ‌ల‌న స‌వాల్‌కు కేసీఆర్ అండ్ కో స్పందిస్తుందా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News