కాంగ్రెస్‌ని దెబ్బేసిన వెంక‌ట‌రెడ్డి.. కీల‌క స‌మ‌యంలో ఫారిన్ టూర్‌

Update: 2022-10-10 12:37 GMT
అత్యంత కీల‌క స‌మ‌యంలో కాంగ్రెస్‌ను గురి చూసి మ‌రీ దెబ్బ‌కొట్టారు.. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్న ఈయ‌న ను పార్టీ హైకమాండ్ ఏకంగా స్టార్ క్యాంపెయిన‌ర్‌గా కూడా గుర్తించింది. పార్టీకి మేలు చేస్తార‌ని.. పార్టీ పుంజుకునేలా వ్యూహాత్మ కంగా అడుగులు వేస్తార‌ని భావించింది. అయితే.. అదే వెంక‌ట రెడ్డి స‌మ‌యం చూసుకుని.. పార్టీని పుట్టిముంచే ప‌నిచేప‌ట్టార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీకి మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. సిట్టింగు సీటులో ఉన్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అనూహ్యంగా బీజేపీకి ద‌గ్గ‌రై.. కాంగ్రెస్‌కు రిజైన్ చేశారు.

ఈ క్ర‌మంలో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. బీజేపీ త‌ర‌ఫున త‌న సోద‌రుడు రాజ‌గోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ క్లిష్ట స‌మ‌యంలో కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మునుగోడులో ప్ర‌చారం చేస్తార‌ని.. కాంగ్రెస్ ప‌రువు నిల‌బెడ‌తార‌ని పార్టీ భావించింది. అయితే.. ఆయ‌న మాత్రం తాజాగా పార్టీకి ఝ‌ల‌క్ ఇచ్చారు. వాస్త‌వానికి ఇక్క‌డ అభ్య‌ర్థి ఎంపిక‌లో వెంక‌ట‌రెడ్డి కీ రోల్ పోషించారు. పాల్వాయి స్రవంతిని ఎంపిక చేయ‌డం వెనుక ఆయ‌న చ‌క్రం తిప్పారు. లేక‌పోతే.. రేవంత్‌రెడ్డి భావించిన‌ట్టు ఆర్థికంగా బ‌లంగా ఉన్న తీగ‌ల‌ కృష్నారెడ్డికి ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

కానీ, వెంక‌ట రెడ్డి దూకుడు కార‌ణంగా స్ర‌వంతికి టికెట్ ద‌క్కింది. అయితే.. ఇంత చేసినా.. వెంక‌ట‌రెడ్డి మాత్రం.. కాంగ్రెస్‌ను కీల‌క స‌మ‌యంలో వ‌దిలేయ‌డం.. గ‌మ‌నార్హం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ష‌బ్బీర్ అలీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు.. ఆయ‌న‌ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. ఈ స‌మ‌యంలోనే మునుగోడుకు.. నోటిఫికేష‌న్ రావ‌డం.. అక్క‌డ ఎన్నిక‌లు రెడీ కావ‌డం.. ప్ర‌చారం ప్రారంభించ‌డం కూడా జ‌రిగిపోయాయి. దీంతో స్టార్ క్యాంపెయిన‌ర్ కోసం.. కాంగ్రెస్ నేత‌లు ఎదురు చూశారు. కానీ, ఇంత‌లోనే ఆయ‌న విదేశాల‌కు వెళ్లిపోతున్న‌ట్టు స‌మాచారం.

అది కూడా కుటుంబంతో క‌లిసి ఫారిన్ టూర్ పెట్టుకున్న‌ట్టు తాజాగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇది ఎంత వ‌ర‌కు అంటే.. మును గోడు అసెంబ్లీ ఎన్నిక పూర్తయి.. రిజ‌ల్ట్ చేతికి వ‌చ్చే వ‌ర‌కు ఆయ‌న అస‌లు దేశంలోనే ఉండ‌డం లేద‌న్న మాట‌. ఈ ప‌రిణామా ల‌ను గ‌మ‌నిస్తే..త న సోద‌రుడు., అస‌లు ఉప ఎన్నిక‌కు కార‌ణ‌మైన రాజ‌గోపాల్‌రెడ్డికి మేలు చేయ‌డం కోసమే.. వెంక‌ట రెడ్డి ఇలా చేస్తున్నార‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంది. గ‌త కొంత కాలంగా బీజేపీలో చేరిపోతార‌ని కూడా వెంక‌ట రెడ్డిపై ప్ర‌చారం జ‌రుగుతోంది.

 అయితే.. దానిని ఆయ‌న ఖండించ‌లేదు. కానీ.. ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఆయ‌న బీజేపీకి మేలు చేసేందుకు .. త‌న సోద‌రుడిని గెలిపించుకునేందుకు విదేశీ ప‌ర్య‌ట‌న వ్యూహాన్ని తెర‌మీదికి తెచ్చార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి పార్టీ ప‌ద‌వులు ఇచ్చి.. ఎంపీ టికెట్లు ఇచ్చి.. కొన్ని ద‌శాబ్దాలుగా పోషించిన పార్టీని ఇలా చేయ‌డం స‌మంజ‌స‌మేనా? అని పార్టీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రిదీనికి వెంక‌ట రెడ్డి ఏం స‌మాధానం చెబుతారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News