కోమ‌టిరెడ్డిలో ఎందుకు ఇంత వైరాగ్యం?

Update: 2018-08-23 06:44 GMT
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్‌ బ్రాండ్ నేత‌ - సీనియ‌ర్ నాయ‌కుడు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి వైరాగ్యంలోకి చేరిపోయారా?ఓ వైపు పార్టీలో స‌రైన స్థానం ద‌క్క‌క‌పోవ‌డం మ‌రోవైపు ఎమ్మెల్యే ప‌ద‌వి విష‌యంలో ఎదుర‌వుతున్న షాకుల ప‌రంప‌ర‌తో ఆయ‌న ఆవేద‌న చెందుతున్నారా? అందులో భాగంగానే ఇవే నా చివరి ఎన్నికలు అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తాజాగా కోమ‌టిరెడ్డి వ్యాఖ్య‌ల‌ను గ‌మ‌నించిన వారికి ఆయ‌న స‌హ‌జ‌శైలికి భిన్న‌మైన తీరుతో మాట్లాడ‌టం ప‌ట్ల ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

శాసనసభ్యత్వానికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి - సంపత్‌ కుమార్‌ లకు చుక్కెదురయిన సంగ‌తి తెలిసిందే. వారి శాసనసభ్యత్వాలను పునరుద్ధరిస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ జారీచేసిన ఉత్తర్వులను మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ - జస్టిస్ వీ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం నిలిపివేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై రెండునెలలపాటు (అక్టోబర్ 20 వరకు) స్టే విధించింది. అసెంబ్లీ కార్యదర్శి - న్యాయశాఖ కార్యదర్శులపై కోర్టు ధిక్కార చర్యలను కూడా నిలిపివేసింది.  రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ పై ఇయర్ ఫోన్‌ ను బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు విసిరేశారని.. ఇది రాజ్యాంగాన్ని అవమానపర్చడమేనని అసెంబ్లీ కార్యదర్శి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలిపారు. అలా దాడిచేసిన వ్యక్తులపై చర్యలు చేపట్టే అధికారం అసెంబ్లీకి ఉంటుందని.. సభను నియంత్రించే అధికారం స్పీకర్‌కు ఉంటుందని వివరించారు. ఏపీ ఎమ్మెల్యే రోజా కేసులో ఇదే హైకోర్టు గతంలో తీర్పును వెలువరించిందని ఉదహరించారు. కోమటిరెడ్డి - సంపత్‌ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణలో జస్టిస్ బీ శివశంకర్‌ రావు నేతృత్వంలోని న్యాయస్థానం పరిధిని మించి ఉత్తర్వులు జారీచేసిందన్నారు. వాద‌న‌ల‌తో ఏకీభ‌వించిన ధ‌ర్మాస‌నం గ‌తంలోని ఉత్త‌ర్వుల అమ‌లుపై రెండు నెల‌ల స్టే విధించింది.

ఇలా హాట్ హాట్ ప‌రిణామాలు సాగుతున్న క్ర‌మంలో తాజాగా త‌న త‌న‌యుడు దివంగ‌త‌ ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్యూరిఫైడ్ వాటర్‌ ప్లాంటు ప్రారంభోత్స‌వంలో కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని - ఆ ఎన్నికల తరువాత తిరిగి పోటీచేయబోనని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. తాను ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమని చెప్పారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌లే త‌న‌కు చివ‌రవ‌ని ఆయ‌న పేర్కొన్నారు. కాగా, కోమ‌టిరెడ్డి ఇలాంటి కామెంట్లు చేయ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది.
Tags:    

Similar News