కేసీఆర్ కంటే బాబు బెస్ట్

Update: 2017-06-22 14:55 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కంటే ఉమ్మ‌డి రాష్ర్టానికి సీఎంగా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు నాయుడు తీరు బాగుంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, సీఎల్పీ ఉప‌నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌ రెడ్డి అన్నారు. స్వ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయిన కేసీఆర్ కంటే ఉమ్మ‌డి రాష్ట్ర సీఎం ఎందుకు త‌న‌కు న‌చ్చుతున్నారో కూడా కోమ‌టిరెడ్డి వివ‌రించారు. ఇంత‌కూ కోమ‌టిరెడ్డికి కేసీఆర్ కంటే బాబు ఎందుకు న‌చ్చుతున్నాడంటే స‌చివాల‌యానికి రావ‌డం విషయంలో, ప్ర‌జ‌లు, నాయ‌కుల‌తో స‌మావేశం అవుతున్న తీరే న‌చ్చింద‌ట‌!

తెలంగాణ స‌చివాల‌యంలో సీఎస్‌ను క‌లిసిన అనంత‌రం మీడియాతో మాట్లాడిన కోమ‌టిరెడ్డి ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటు స‌చివాల‌యానికి రావ‌డం లేద‌ని, అటు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ లోనూ అపాయింట్‌ మెంట్ ఇవ్వ‌డం లేద‌ని కోమ‌టిరెడ్డి మండిప‌డ్డారు. ఈ తీరును చూస్తుంటే గ‌తంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడే మేల‌ని అనిపిస్తోంద‌ని తెలిపారు. ముఖ్య‌మంత్రి ఇలాగే కొన్నాళ్ల‌పాటు స‌చివాల‌యానికి దూరంగా ఉంటే...ఏదో ఒక సంద‌ర్భంలో మియాపూర్ భూముల వ‌లే స‌చివాల‌యాన్ని సైతం ఎవ‌రో ఒక‌రు ఎప్పుడో ఒక‌సారి క‌బ్జా చేస్తేస్తారని వ్యాఖ్యానించారు.

కాగా, కోమ‌టిరెడ్డి విమ‌ర్శ‌ల‌ను టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్ ఖండించారు. సీఎంను కలువడానికి సమయం ఇవ్వలేదనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. విప‌క్ష ఎమ్మెల్యేల్లో సీఎం కేసీఆర్‌ ను అత్యధికంగా కలిసింది కోమటిరెడ్డేనని తెలిపారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు మూడేళ్ల‌లో కేవలం ఐదుసార్లు మాత్రమే అమెరికాలో పర్యటించారని.. అప్పటి ఐటీశాఖ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి అనేకమార్లు అమెరికాలో పర్యటించారని తెలిపారు. కేటీఆర్ అమెరికా పర్యటనతో అనేక ప్రతిష్ఠాత్మక, భారీ కంపెనీలు హైదరాబాద్‌ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని.. కోమటిరెడ్డి పర్యటనతో ఏ కంపెనీలు వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News