కోమ‌టిరెడ్డి ముఖ్య అనుచ‌రుడి దారుణ హ‌త్య‌..!

Update: 2018-01-25 07:39 GMT
    తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య‌నేత‌ల్లో ఒక‌రైన కోమ‌టిరెడ్డి  వెంక‌ట‌రెడ్డికి ముఖ్య అనుచ‌రుడు.. కుడి భుజంగా చెప్పే అనుచ‌రుడు.. న‌ల్గొండ మున్సిప‌ల్ ఛైర్ ప‌ర‌స‌న్ బొడ్డుప‌ల్లి ల‌క్ష్మీ భ‌ర్త శ్రీ‌నివాస్ దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు బండ‌రాయిని మోది హ‌త్య చేసిన వైనం సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న ఇంటి స‌మీపంలో చోటు చేసుకున్న ఈ హ‌త్య ఉదంతం న‌ల్గొండ‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది.

    రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో శ్రీ‌నివాస్ ఇంటికి స‌మీపంలో కొంద‌రు వ్య‌క్తులు గొడ‌వ ప‌డ్డారు. ఈ స‌మ‌యంలో స్థానిక కౌన్సిల‌ర్ కుమారుడు మెర‌గు గోపి స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. గొడ‌వ ఎంత‌కూ త‌గ్గ‌క‌పోవ‌టంతో శ్రీ‌నివాస్‌కు గోపీ ఫోన్ చేసి విష‌యం చెప్పారు. దాంతో తాను వ‌స్తున్న‌ట్లుగా చెప్పిన శ్రీ‌నివాస్ ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. శ్రీ‌నివాస్ వ‌చ్చాక ఇష్యూ అంత‌కంత‌కూ పెర‌గ‌ట‌మే కాదు.. అనూహ్యంగా బండ‌రాయిని బ‌లంగా మోది మురికికాల‌వ‌లో ప‌డేసిన‌ట్లుగా తెలుస్తోంది.

    అనంత‌రం హ‌త్య‌కు పాల్ప‌డిన నిందితులు నేరుగా పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి లొంగిపోవ‌టం గ‌మ‌నార్హం. శ్రీ‌నివాస్ హ‌త్య విష‌యం తెలిసిన వెంట‌నే అలెర్ట్ అయిన పోలీసులు. . ఎలాంటి గొడ‌వ‌లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు వీలుగా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకున్నారు.

    హ‌త్య విష‌యంపై తెలిసిన వెంట‌నే జిల్లా ఎస్పీ ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకొని హ‌త్య జ‌రిగిన తీరును ప‌రిశీలించారు. మృతుడి దేహానికి పోస్టుమార్ట‌మ్ చేసేందుకు త‌ర‌లించారు. త‌న ముఖ్య అనుచ‌రుడి దారుణ‌హ‌త్య గురించి తెలిసిన వెంట‌నే హైద‌రాబాద్ నుంచి హుటాహుటిన బ‌య‌లుదేరిన కోమ‌టిరెడ్డి.. శ్రీ‌నివాస్ కుటుంబాన్ని ఓదార్చారు.  త‌న ప్ర‌ధాన అనుచ‌రుడు శ్రీ‌నివాస్ హ‌త్య‌ను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. నేరుగా ఎదుర్కొనే ద‌మ్ము లేకనే దొంగ‌చాటుగా కుట్ర ప‌న్ని శ్రీ‌నివాస్ ప్రాణం తీసిన‌ట్లుగా మండిప‌డ్డారు. ఒంట‌రిని చేసి చంప‌టం పిరికిపంద చ‌ర్య‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు.
 
    సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత త‌మకు.. త‌మ అనుచ‌రుల  ప్రాణాల‌కు హాని ఉంద‌ని.. గ‌తంలో ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేసినా టీఆర్ఎస్ స‌ర్కారు ఇప్ప‌టివ‌ర‌కూ ప‌ట్టించుకోవ‌టం లేద‌ని కోమ‌టిరెడ్డి విమ‌ర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో నేత‌ల ప్రాణాల‌కుభ‌ద్ర‌త లేకుండా పోతుంద‌న్న కోమ‌టిరెడ్డి.. ఇలాంటి ప‌రిస్థితుల్లో సామాన్యుల ప‌రిస్థితేంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

    పోలీసుల తీరును కోమ‌టిరెడ్డి త‌ప్పు ప‌ట్టారు. శాంతిభ‌ద్ర‌త‌ల్ని కాపాడాల్సిన పోలీసులు అధికార నేత‌ల‌కు కొమ్ము కాస్తున్న వైనాన్ని త‌ప్పు ప‌ట్టారు. స్థానిక డీఎస్పీ అధికార‌ప‌క్షానికి వ‌త్తాసు ప‌లుకుతూ.. టీఆర్ఎస్ నేత‌ల రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్న‌ట్లుతా ఆరోపించారు. త‌న ముఖ్య అనుచ‌రుడి హ‌త్య‌తో కోమ‌టి రెడ్డి క‌దిలిపోయారు. భోరున విల‌పించారు. అంత పెద్ద నేత‌.. విల‌పించిన తీరుతో అక్క‌డి వాతావ‌ర‌ణం ఉద్రిక్తంగా మారింది. శ్రీ‌నివాస్ హ‌త్య‌తో తీవ్రంగా రోదిస్తున్న ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం చెప్పిన కోమ‌టిరెడ్డి.. ఆ కుటుంబానికి తాను అండ‌గా ఉంటాన‌ని భ‌రోసా ఇచ్చారు.



Tags:    

Similar News