చ‌చ్చిపోయాక త‌న‌పై కాంగ్రెస్ జెండా క‌ప్పాల‌ట‌

Update: 2017-11-29 09:23 GMT
అవ‌సరం - అవ‌కాశం కోసం అన్న‌ట్టుగా మారిపోయిన ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఏ నేత ఏపార్టీ ఎప్పుడు మార‌తాడో?  ఏ నేత ఏ పార్టీ జెండా ఎప్పుడు ప‌ట్టుకుంటాడో కూడా చెప్ప‌డం క‌ష్ట‌మే! ఒక్క ఏపీలోనే కాదు, తెలంగాణ‌లోనూ ప‌రిస్థితి ఇలానే ఉంది. రాత్రికి రాత్రి నేత‌లు తీసుకుంటున్న డెసిష‌న్లు.. రాజ‌కీయంగా పెనుకుదుపుల‌కు గురి చేస్తున్నాయి. త‌మ‌కు ఎవ‌రు అవ‌కాశం, ఎవ‌రు అధికారం అప్ప‌గిస్తే.. వారి పార్టీలోకి ఎలాంటి జంకు, గొంకు కూడా లేకుండా నేత‌లు ఫిరాయించేస్తున్నారు. దైవం.. ప్రాణం.. అంటూనే పార్టీల గోడ‌లు దూకేస్తున్నారు. దీనికి వారు వీరు అనే భేదం, సామాజిక వ‌ర్గాల్లో సంబంధం వంటివేవీ లేదు. అంతా ఆ తానులో ముక్క‌లే అన్న చందంగా నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తెలంగాణ‌లోనూ ఇప్పుడు ఇదే ట్రెండ్ కొన‌సాగుతోంది. త‌మ‌కు ఏ పార్టీ అండ‌గా ఉంటుంది?  ఏ పార్టీలో అయితే త‌మ‌కు అధికారం ల‌భిస్తుంది? వ‌ంటి కీల క అంశాల‌ను భేరీజు వేసుకుంటున్న నేత‌లు. . ఆయా పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. జిలానీలు అని పేరు తెచ్చుకున్నా ఫ‌ర్లేదు.. అధికారం, అంబ‌రం ద‌క్కితే చాల‌ని డి... సైడై పోతున్నారు. ఈ కోవ‌లేనో నిన్న మొన్న‌టి వ‌ర‌కు న‌ల్ల‌గొండ‌కు చెందిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ పేర్లు భారీ ఎత్తున వినిపించాయి. వీరు కాంగ్రెస్‌లోనే ఉన్నా.. మ‌న‌సు మాత్రం అధికారం వైపే మొగ్గు చూపింది. ఈ క్ర‌మంలోనే ఒకరు ఎమ్మెల్యే అయినా మ‌రొక‌రు ఎంపీ అయినా.. ఉన్న‌దాంతో స‌ర్దుకోలేక పోయారు. ఏకంగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ప‌ద‌వికే గేలం వేశారు.

అయితే, అనూహ్యంగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి ఢిల్లీలో ఉన్న కొద్దిపాటి ప‌లుకుబ‌డితో త‌న సీటునుతాను కాపాడుకోగ‌లిగారు. అయినా కూడా ఈ బ్ర‌ద‌ర్స్ కోమిటిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, రాజ‌గోపాల్ రెడ్డిలు మాత్రం అధికారం కోసం త‌హ‌త‌హ లాడిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో వారు పార్టీ మార‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు వెల్లువెత్తాయి. ప్ర‌ధానంగా అయితే టీఆర్ ఎస్ లేక‌పోతే.. బీజేపీ.. అనే త‌ర‌హాలో వార్త‌లు వెలుగు చూశాయి. ఈ క్ర‌మంలోనే స్పందించిన కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి.. త‌న పార్టీ మార్పుపై తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను  పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని, తనకు వ్యతిరేకంగా కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

తాను చనిపోయిన తర్వాత కూడా తనపై కాంగ్రెస్ జెండానే ఉంటుందని స్పష్టం చేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. ఇలాంటి నేతకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలు, రైతులకు అండగా ఉండే కాంగ్రెస్‌కు ప్రజలు అండగా నిలిచి టీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను కసిగా ఓడించాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. సో.. మొత్తానికి ఇప్ప‌టికైతే క్లారిటీ వ‌చ్చినా.. అధికార పార్టీ ఈ బ్ర‌ద‌ర్స్ వైపు క‌న్నెత్తి చూడ‌ని కార‌ణంగానే ఇలా గొంతు చించుకున్నార‌నే విమ‌ర్శ‌లూ వ‌స్తున్నాయి. మ‌రి వీటికి రాబోయే రోజుల్లో క్లారిటీ ల‌భిస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News