'దద్దమ్మలు' తో కేసీఆర్ కు కౌంటర్!

Update: 2016-12-20 04:20 GMT
చవటలు, దద్దమ్మలు వంటి పదాలు అన్ పార్లమెంటరీ పదాలని మరిచిపోయేలా ఫేమస్ చేశారు కొంతమంది నేతలు. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ పోరాట సమయంలోనే కానీ.. అసెంబ్లీ సమావేశాల్లోనే కానీ ఈ రెండు పదాలు తరచు వినిపించేవి. ఈ పదాలను ఉన్నంతలో కాస్త అధికంగా వాడిన వారిలో నేటి తెలంగాణ ముఖ్యమంత్రి ఒకరు! అయితే ఆయన ఎక్కువగా కాంగ్రెస్ నాయకులను విమర్శించేటప్పుడు ఈ పదాలను తరచూ ఉపయోగించేవారు. ఇంతకాలం తెలంగాణ అభివృద్ధికి నోచుకోకపోవడానికి నాటి పాలకులే కారణం అని విమర్శించే సందర్భంగా ఈ పదాలు ఉపయోగించేవారు. అయితే వీటికి సరైన కౌంటర్ ఇవ్వలేకపోయేవారు మిగిలిన నేతలు. అయితే తాజాగా తెలంగాణ అసెంబ్లీలోనే ఈపనికి పూనుకున్నారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

ప్రస్తుతం కృష్ణానదిపై ఉన్న రిజర్వాయర్లలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ పంటలకు నీరివ్వలేని మంత్రులను ఏమనాలి? అని ప్రశ్నించిన కోమటిరెడ్డి... ఇప్పుడు వారిని "దద్దమ్మలు" అని అనాలా? అని ప్రశ్నించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ లలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ సాగర్‌ ఆయ కట్టుకు నీరు ఎందుకు అందించడంలేదని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా సమైక్య రాష్ట్రంలో వారు ఎదుర్కొన్న విమర్శలను గుర్తుచేసిన కోమటిరెడ్డి... సమైక్య రాష్ట్రంలో రెండు పంటలకు నీరిచ్చినప్పటికీ నాటి మంత్రులను చవటలు, దద్దమ్మలు అని టీ.ఆర్‌.ఎస్‌ నేతలు విమర్శించారని, మరి ఇప్పుడు ఈ టీ.ఆర్‌.ఎస్‌ మంత్రులను ఏమని పిలవాలో చెప్పాలని కోమటిరెడ్డి కోరారు. ఏది ఏమైనా మిగిలిన అసెంబ్లీలతో పోల్చుకుంటే... తెలంగాణ అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చలు నడుస్తున్నాయనే అనుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News