త‌గ్గేదేలే అంటున్న కోమ‌టిరెడ్డి... ఓ మెట్టు దిగిన రేవంత్ రెడ్డి

Update: 2021-08-13 14:33 GMT
తెలంగాణ పీసీసీ ర‌థ‌సార‌థిగా రేవంత్ రెడ్డి పేరు జాబితాలో ఉన్న‌ది మొద‌లుకొని ఆ పార్టీలో అంత‌ర్గ‌త రాజ‌కీయాలు మ‌రింత ముదిరిపోయాయి. ఇక రేవంత్ కు పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఖ‌రారు అవ‌డంతో సీనియ‌ర్లు త‌మ‌దైన శైలిలో అల‌క‌బూనారు. అసంతృప్తి గ‌ళం వినిపించారు. ఇలాంటి వారిలో  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి పేరు ప్ర‌ధానంగా వినిపిస్తోంది. తాజాగా ఎంపీ కోమ‌టిరెడ్డి ఎఫెక్ట్‌తో రేవంత్ రెడ్డి దూకుడు త‌గ్గింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ప్ర‌తిష్టాత్మ‌క స‌భ విష‌యంలో.

పీసీసీ అధ్య‌క్షుడిగా ప‌గ్గాలు చేప‌ట్టిన రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఇంద్రవెల్లిలో నిర్వ‌హించిన ఆదివాసి ఆత్మగౌరవ దండోరా సభ విజ‌యవంతం అయింది. ఇదే ఊపులో ఈ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నం వేదికగా తర్వాత సభ నిర్వహిస్తామంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స‌భా వేదిక‌గానే ప్ర‌క‌టించారు. అయితే, ఇప్పుడా సభను కాంగ్రెస్‌ పార్టీ రద్దు చేసింది! అదే రోజున స‌భ‌ను నిర్వ‌హిస్తున్న‌ప్ప‌టికీ ఇబ్ర‌హీంప‌ట్నంలో కాకుండా మ‌హేశ్వ‌రంలో జ‌ర‌గ‌నుంది. దీనికి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కార‌ణ‌మంటున్నారు.

ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన తలపెట్టిన దళిత గిరిజన దండోరా సభను మ‌హేశ్వరం నియోజక వర్గంలోకి సభను మారుస్తూ నిర్ణయం తీసుకోవ‌డం వెనుక కోమ‌టిరెడ్డి అల‌క‌బూన‌డం కార‌ణమ‌ని అంటున్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా సభ ఏర్పాటు చేయ‌డంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి అలకబూనిననట్టు తెలుస్తోంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సభ ఏర్పాటుపై అసంతృప్తితో ఉండడతో ఇబ్ర‌హీంప‌ట్నం నియోజకవర్గాన్ని మార్చేసి మహేశ్వరంలో సభను నిర్వహించేందుకు సిద్ధమైంది. మొత్తంగా ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఎఫెక్ట్‌తో రేవంత్ రెడ్డి త‌న దూకుడు త‌గ్గించార‌ని టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News