ఏపీ డిప్యూటీ స్పీకర్ గా కోన..ప్రకటనే మిగిలి ఉంది

Update: 2019-06-17 13:30 GMT
ఏపీ అసెంబ్లీలో నూతన డిప్యూటీ స్పీకర్ గా వైసీపీ నేత - బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో వైసీపీ అధికారం దక్కించుకోగా.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత గతంలో ఎన్నడూ లేనంత మేర బడుగు, బలహీన వర్గాలకు చెందిన నేతలకు అత్యధిక మందికి మంత్రి పదవులు కట్టబెట్టిన జగన్... బ్రాహ్మణ సామాజిక వర్గానికి మాత్రం కేబినెట్ లో చోటు కల్పించలేకపోయారు. అయితే ఆ వర్గాన్ని కూడా నిర్లక్ష్యం చేయడం లేదన్న సంకేతాలను చాలా స్పష్టంగానే ఇచ్చిన జగన్... బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే బాపట్ల నియోజకవర్గం నుంచి వరుసగా రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టారు.

ఇక డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నిబంధనల మేరకు నేటి ఉదయం స్పీకర్ తమ్మినేని సీతారాం నోటిఫికేషన్ జారీ చేయగా... సాయంత్రానికి గడువు ముగిసేలాగో కోన రఘుపతి ఒక్కరే నామినేషన్ వేశారు. కోన నామినేషన్ పత్రాలపై పది మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ సంతకాలు చేశారు. ఆ తర్వాత నామినేషన్ పత్రాలను కోన... ఎన్నికల అధికారికి అందజేశారు. నామినేషన్లకు గడువు ముగిసేలోగా కోన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఈ విషయాన్ని రేపటి అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే.. కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకర్ రావు ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో స్పీకర్ గా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న ప్రభాకర్ రావు స్పీకర్ పదవి తర్వాత మహారాష్ట్ర, సిక్కిం రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా పనిచేశారు.

ఈ క్రమంలో ప్రభాకర్ రావు స్పీకర్ గా, గవర్నర్ గా తనదైన శైలిలో రాణిస్తే.... ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కోన రఘుపతి ఆది నుంచి వైఎస్ ఫ్యామిలీతోనే సాగారు. వైఎస్ బతికుండగా టికెట్ దక్కకున్నా కూడా ఆయన వైఎస్ ఫ్యామిలీని వీడలేదు. ఇక జగన్ వైసీపీని ప్రారంభించిన నాటి నుంచి జగన్ వెంటే ఉన్నారు. 2014లో వైసీపీ తరఫున బాపట్ల నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచిన కోన... తాజా ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి గెలిచారు. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన కోన... తన తండ్రి స్పీకర్ గా వ్యవహరిస్తే...తాను ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించనున్నారు. మరి తండ్రి మాదిరే భవిష్యత్తులో కోన... ఇంకెన్ని ఉన్నత పదవులు అలంకరిస్తారోనన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
Tags:    

Similar News