తెలంగాణ‌తో అవ‌స‌రంలేద‌న్న టీడీపీ ఎంపీలు

Update: 2016-06-30 16:06 GMT
హైకోర్టు విభజన - న్యాయ‌మూర్తుల ఆప్ష‌న్ వ్య‌వ‌హారం ముదురు పాకాన ప‌డుతున్నట్లుగా క‌నిపిస్తోంది. న్యాయ‌మూర్తుల వివాదం విష‌యంలో తెలంగాణ టీఆర్ ఎస్ నాయ‌కులు స‌హ‌జంగానే ఒకింత దూకుడుగా స్పందించారు. ఏపీ సీఎం చంద్ర‌బాబును - టీడీపీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేశారు. త‌మ పార్టీని - ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డంపై తెలుగుదేశం ఎంపీలు సైతం ఘాటుగానే స్పందించారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కొనకళ్ల నారాయణ - కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తీరును త‌ప్పుప‌ట్టారు. అస‌లు త‌మ‌కు తెలంగాణ‌తో ప‌నేం లేద‌ని తేల్చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ న్యాయవ్యవస్థనే తప్పుబట్టే విధంగా మాట్లాడుతున్నారని తెదేపా ఎంపీలు మండిపడ్డారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా కేసీఆర్‌ మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు. హైకోర్టు విభ‌జ‌న విష‌యంలో గ‌తంలో వ‌లే రెచ్చ‌గొట్టే రాజ‌కీయాల‌కు టీఆర్ ఎస్ పార్టీ పాల్ప‌డ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని నాని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులకు ప్రాంతీయతత్వం అంటగట్టడం సరికాదన్నారు. హైకోర్టు విభజనకు - చంద్రబాబు సంబంధం ఏమిటో కేసీఆర్‌ సమాధానం చెప్పాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు. లోటు బడ్జెట్‌ ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని కొనియాడారు. సొంత ప్రాంతం నుంచే పాలన కొనసాగించేందుకు అన్ని శాఖలను తరలిస్తున్నందున ఇంకా తెలంగాణపై ఆధారపడాల్సిన పని తమకు లేదని స్పష్టం చేశారు.

టీడీపీ ఎంపీల ఘాటు స్పంద‌న చూస్తుంటే మ‌రోమారు తాజా ప‌రిణామాలు ఇరు రాష్ట్ర నాయ‌కుల మ‌ధ్య రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారుతాయ‌నే అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే కృష్ణా జ‌లాల వివాదం ర‌గులుతుండ‌గా దానికి హైకోర్టు అంశం జ‌త‌కూడింద‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News