కొనకళ్లకు కేంద్ర మంత్రి పదవి?

Update: 2017-04-11 08:07 GMT
కేంద్రమంత్రివర్గంలో టీడీపీకి మరో బెర్తు దాదాపు రెడీ అయినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న మోడీ కేబినెట్ విస్తరణలో మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణకు పదవి ఇచ్చేందుకు టీడీపీ, బీజేపీల మధ్య అంగీకారం కుదిరినట్లు సమాచారం. అయితే... చివర నిమిషంలో ఏమైనా తేడా రావచ్చన్న భావన వ్యక్తమవుతోంది.  మరో ఎంపీ తోట నరసింహం పేరు కూడా పరిశీలనలో ఉందని.. ఆయనకూ కొంత అవకాశం ఉందని టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
    
పార్టీ కార్యక్రమాలకు సంబంధించి డిల్లీలో నిత్యం అందుబాటులో ఉండడం.. పార్టీ పట్ల విధేయత వంటి కారణాల వల్ల కొనకళ్ల పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీల ప్రతినిధి కావడం కూడా కలిసొచ్చే అంశమని చెబుతున్నారు.
    
అయితే... ఏపీలో రాజకీయ సమీకరణల ప్రకారం కాపు వర్గం నుంచి ఎవరికైనా ఇవ్వాలన్న ప్రతిపాదనా ఉంది. ఈ లెక్కలతోనే తోట నరసింహం పేరు తెరపైకి  వస్తోంది. కాపు ఉద్యమాలతో వేడెక్కిస్తున్న ముద్రగడ సొంత జిల్లాకు చెందిన తోటకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఆ వర్గాన్ని పార్టీలో ఉంచొచ్చన్న భావన ఉంది.
    
అయితే... పార్టీ ప్రయోజనాలతో పాటు సొంత ప్రయోజనాల లెక్కల్లో కొనకళ్ల వైపు చంద్రబాబు, లోకేశ్ లు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా గుడివాడలో వచ్చే ఎన్నికల్లో లోకేశ్ పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అక్కడ లోకేశ్ కు అంతా అనుకూల వాతావరణం ఏర్పడి గెలుపు నల్లేరుపై నడకలా మార్చే బాధ్యత కొనకళ్ల భుజాన వేసుకోవాల్సి ఉంటుందని.. అందులో భాగంగానే ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కొచ్చని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News