మునుగోడు బరిలో బీఎస్పీ అభ్యర్థి ఈయనే!

Update: 2022-10-08 16:30 GMT
తెలంగాణలో మునుగోడులో జరగనున్న ఉప ఎన్నిక సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దించాయి. కాంగ్రెస్‌ పార్టీ తరఫున కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్థన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి, బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బరిలోకి దిగారు.

అంతేకాకుండా కేఏ పాల్‌ నాయకత్వంలోని ప్రజా శాంతి పార్టీ తరఫున ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థిగా ఆందోజు శంకరాచారిని ఆ పార్టీ బరిలోకి దించింది. తమ పార్టీ అధినేత్రి మాయావతి ఆదేశాల మేరకు ఉన్నత విద్యావంతుడు, యువకుడైన ఆందోజు శంకరాచారిని మునుగోడు బరిలో దించుతున్నట్టు బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రకటించారు. ఈ మేరకు శంకరాచారికి ఆయన బీఫామ్‌ అందజేశారు. ఉన్నత విలువలున్న యువనాయకుడు శంకరాచారిని గెలిపించాలని ఈ సందర్భంగా ప్రవీణ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.

కాగా మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్‌ నవంబర్‌ 3న జరగనుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ కోట్లాది రూపాయలను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తున్నాయని చెప్పుకుంటున్నారు. అయితే మొదటి నుంచి మునుగోడులో కాంగ్రెస్‌ బలంగా ఉండటం, ఆ పార్టీ మహిళకు సీటు ఇవ్వడం వంటి కారణాలతో కాంగ్రెస్‌ ఇక్కడ గెలిచే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో మునుగోడులో విజయం కోసం అన్ని రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ ముఖ్య నేతలను రంగంలోకి దించాయి. మునుగోడులో విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే నవంబర్‌ 6 వరకు వేచి చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News