కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి..పొలిటిక‌ల్ ప‌య‌నం ఎటు..!

Update: 2019-07-15 04:13 GMT
రాష్ట్ర రాజ‌కీయాల్లోనే కోట్ల కుటుంబానికి ప్ర‌త్యేక స్థానం ఉంది. కోట్ల విజ‌య‌భాస్క‌ర‌రెడ్డి సీఎంగా ఉమ్మ‌డి రాష్ట్రాన్ని పాలిం చారు. కాంగ్రెస్‌ లో సుధీర్ఘ అనుభ‌వం ఉన్న - రాజ‌కీయ చ‌తుర‌త‌కు పెద్ద‌పీట వేసిన ఈ కుటుంబం ఇప్పుడు రాజ‌కీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటుండ‌డం గ‌మ‌నార్హం. సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్‌ లోనే రాజ‌కీయాలు చేసిన కోట్ల కుటుంబం.. రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీలో కాంగ్రెస్ మ‌ట్టికొట్టుకు పోయినా..కూడా ఆపార్టీలోనే కొన‌సాగింది. 2014లో ఈ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన కోట్ల విజ‌య‌భాస్క‌ర‌రెడ్డి వార‌సుడు సూర్య‌ప్ర‌కాశ్‌ రెడ్డి.. ఓట‌మి చ‌విచూశారు. ఇక‌, 2018 నుంచి ఆయ‌న కాంగ్రెస్‌ కు దూరంగా వుంటూ వ‌చ్చారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న పార్టీ మారి.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న‌కు - త‌న భార్య‌కు కూడా టికెట్లు సంపాయించుకుని పోటీ చేశారు. అయితే, జ‌గ‌న్ సునామీ ముందు టీడీపీ గ‌ల్లంతైన నేప‌థ్యంలో కోట్ల ఫ్యామిలీ కూడా అడ్ర‌స్ లేకుండాపోయింది. అయితే, ఇప్పుడు ఆయ‌న టీడీపీలో కొన‌సాగాలా ?  లేక‌.. ఏదైనా దారి చూసుకోవాలా ? అనే డోలాయ‌మానంలో ప‌డిపోయారు. ఓడిపోయిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ ఆఫీస్ గ‌డ‌ప తొక్క‌లేదు. అధినేత చంద్ర‌బాబుకు మొహం కూడా చూపించ‌లేదు.

టీడీపీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతుండ‌డం - నాయ‌కులు త‌మ దారి తాము చూసుకోవ‌డం - అధినేత చంద్ర‌బాబు కూడా పెద్ద‌గా క్షేత్ర‌స్థాయిలో దృష్టి సారించ‌క పోవ‌డంతో టీడీపీ ప‌రిస్థితి వ‌చ్చే ఐదేళ్ల‌కు మ‌రింత దిగ‌జారుతుంద‌నే క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు కోట్ల ఫ్యామిలీ ఇక‌ - టీడీపీలో ఉండి తాము పాముకునేది ఏముంటుంద‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోప‌క్క‌, రాష్ట్రంలో క‌మ‌ల వికాసం దిశ‌గా కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు పావులు క‌దుపుతున్నారు. ఇప్ప‌టికే టీడీపీని టార్గెట్ చేసుకున్న క‌మ‌ల నాథులు వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ప‌ద‌వుల‌పైనా ఆశ‌లు చూపుతున్నార‌ని స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలో రెండో ప్లేస్‌ లో టీడీపీ బ‌దులు బీజేపీ ఉంటుంద‌ని అంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కోట్ల ఫ్యామిలీ క‌మలం దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం రాజ‌కీయాల ట్రెండ్‌ ను నిశితంగా గ‌మ‌నిస్తున్న ఈ కుటుంబంపై క‌మ‌ల నాథులు కూడా ఓ క‌న్నేసి ఉంచారు. ఎప్పుడు అవ‌కాశం చిక్కితే అప్పుడు వీరికి కండువా క‌ప్పేందుకు రెడీ అయ్యారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
 
Tags:    

Similar News