కోట్ల నోట వైసీపీ మాట‌!..బాబుకు బిగ్ షాకేనా?

Update: 2019-02-06 04:25 GMT
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు ఇప్పుడు ఏదీ పెద్ద‌గా క‌లిసి రావ‌డం లేదనే చెప్పాలి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కీల‌క త‌రుణంలో పార్టీలో లుక‌లుక‌లు స్టార్ట్ అయిపోయాయి. క‌డ‌ప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డి పార్టీకి ఝ‌ల‌క్కిచ్చి వైసీపీలో చేరిపోయారు. ఆ త‌ర్వాత ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహ‌న్ కూడా నేడు వైసీపీలోకి చేర‌బోతున్నారు. నిన్న ఆమంచిని ఆపేందుకు చంద్ర‌బాబు సంధించిన ఆస్త్రాలేవీ ప‌నిచేయ‌లేద‌నే చెప్పాలి. మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావుతో పాటు పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - మంత్రి నారా లోకేశ్ ఫోన్ చేసినా కూడా ఆమంచి వెన‌క్కు త‌గ్గ‌లేద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలోనే టీడీపీలోకి దాదాపుగా ఎంట్రీ ఇచ్చిన‌ట్టుగా క‌నిపించిన కేంద్ర మాజీ మంత్రి - క‌ర్నూలు మాజీ ఎంపీ - కాంగ్రెస్ పార్టీ నేత కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి ఇప్పుడు మాట మార్చేశారు. బాబు ఆహ్వానం మేర‌కు భార్య‌ - కొడుకు - త‌మ్ముడితో క‌లిసి ఉండ‌వ‌ల్లికి వ‌చ్చి బాబుతో డిన్న‌ర్ చేసి వెళ్లిన కోట్ల‌... అతి త్వ‌ర‌లోనే టీడీపీలో చేర‌తార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే కోట్ల వ్యూహం మార్చుకున్న‌ట్లుగా తెలుస్తోంది. అస‌లు తాను టీడీపీలో చేరుతున్నాన‌ని ఎప్పుడు చెప్పానంటూ మీడియాకే ఎదురు ప్ర‌శ్న‌లు సంధించిన కోట్ల‌... త‌న‌కు ఒక్క టీడీపీ నుంచి మాత్ర‌మే ఆహ్వానం అంద‌లేద‌న్న విష‌యాన్ని గుర్తించాల‌ని సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్యతో షాక్ తిన్న మీడియా ప్ర‌తినిధులు తేరుకోక ముందే... కోట్ల మ‌రో బాంబు లాంటి మాట చెప్పారు. త‌న‌కు వైసీపీ నుంచి కూడా ఆహ్వానం ఉంద‌ని - ఇప్ప‌టిదాకా తాను ఏ పార్టీలో చేర‌తానో ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని కూడా చెప్పేశారు. ఈ వ్యాఖ్య చంద్ర‌బాబుకు నిజంగానే శ‌రాఘాతంగానే భావించక త‌ప్ప‌దు. ఎందుకంటే.. ఇప్ప‌టికే కోట్ల పార్టీలో చేరుతున్నార‌ని - క‌ర్నూలు జిల్లా నేత‌లు స‌ర్దుకుపోవాల‌ని - కోట్ల‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. మ‌రీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తికి కూడా ఇదే మాట చెప్పారు. ఈ మాట‌ను ఆస‌రా చేసుకున్న ఎల్లో మీడియా కోట్ల టీడీపీలో చేరిపోయిన‌ట్టేన‌ని కూడా వార్త‌లు వండి వార్చేశాయి. అయినా చంద్ర‌బాబుతో డిన్న‌ర్ భేటీకి వెళ్లిన త‌ర్వాత కూడా కోట్ల ఇంకా పార్టీలో చేరేందుకు ఎందుకు సిద్ధ‌ప‌డ‌లేద‌న్న వార్త‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల‌కు సంబంధించి అప్ప‌టిక‌ప్పుడు ప‌చ్చ‌జెండా ఊప‌డంతో పాటుగా క‌ర్నూలు పార్ల‌మెంటు సీటుతో పాటుగా త‌న సతీమ‌ణి కోట్ల సుజాత‌మ్మ‌కు డోన్ అసెంబ్లీ సీటు - కుమారుడు రాఘ‌వేంద్ర రెడ్డికి ఆలూరు అసెంబ్లీ సీట్లు ఇవ్వాల‌ని కోట్ల కండీష‌న్ పెట్టారు. అయితే డోన్ సీటుపై ఇప్ప‌టికే కేఈ ప్ర‌భాక‌ర్ క‌ర్చీఫ్ వేసుకుని మ‌రీ కూర్చున్నారు. ఆలూరు సీటునైనా హామీ ఇద్దామంటే అక్క‌డి ప‌రిస్థితులు అంత‌గా అనుకూలంగా లేవ‌ట‌. ఈ నేప‌థ్యంలో మొన్న‌టి డిన్న‌ర్ భేటీలో క‌ర్నూలు పార్ల‌మెంటు వ‌ర‌కైతే హామీ ఇవ్వ‌గ‌ల‌ను గానీ... డోన్‌ - ఆలూరు అసెంబ్లీల‌పై మాత్రం ఇప్ప‌టికిప్పుడు హామీ ఇవ్వ‌లేన‌ని - వాటి గురించి త‌ర్వాత మాట్లాడుకుందామ‌ని చంద్ర‌బాబు చెప్పార‌ట‌. అయితే ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వ‌స్తున్న కోట్ల కుటుంబం ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి వ‌స్తే... సింగిల్ సీటు ఇస్తామన‌డం ఎంత‌వ‌ర‌కు భావ్య‌మంటూ కోట్ల వ‌ర్గం కాస్తంత అసంతృప్తిగానే ఉంద‌ట‌.

ఈ క్ర‌మంలోనే క‌ర్నూలు పార్ల‌మెంటుతో పాటు డోన్‌, ఆలూరు సీట్ల‌పై కూడా హామీ వ‌స్తేనే టీడీపీలోకి చేర‌దాం, లేదంటే లేదు అన్న‌ట్లుగా ఆ వ‌ర్గం భావిస్తోంద‌ట‌. ఇదిలా ఉంటే... కోట్ల‌కు క‌ర్నూలు పార్ల‌మెంటు ఇస్తే త‌న‌కేమీ అభ్యంత‌రం లేద‌ని, డోన్ అసెంబ్లీని మాత్రం త్యాగం చేసేందుకు తాము సిద్ధంగా లేమ‌ని కేఈ ఫ్యామిలీ బాబుకు తెగేసి చెప్పింద‌ట‌. ఈ నేప‌థ్యంలో అటు కోట్ల‌ను సింగిల్ సీటుకు ఒప్పించ‌లేక‌, ఇటు డోన్ సీటుపై కేఈకి స‌ర్దిచెప్ప‌లేక బాబు స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ట‌. ఈ క్ర‌మంలో టీడీపీ కాకుంటే... త‌న‌కు ఇంత‌కుముందే ఆఫ‌ర్ ఇచ్చిన వైసీపీ ఉండ‌నే ఉంది క‌దా అన్న భావ‌న‌లో కోట్ల ఉన్నార‌ట‌. ఇదే జ‌రిగితే... ఈ ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబుకు నిజంగానే రిట‌ర్న్ పంచ్ కాస్తంత గ‌ట్టిగానే త‌గల‌డం ఖాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది.
Tags:    

Similar News