ఏఎస్ఐ అవ‌య‌వాలు దానం.. వారిని వ‌దిలిపెట్టంః స‌జ్జ‌నార్

Update: 2021-04-01 05:00 GMT
మ‌ద్యం సేవించిన ఓ వ్య‌క్తి కారుతో ఢీకొట్ట‌డంతో మృతిచెందిన ఏఎస్ఐ మ‌హిపాల్ రెడ్డికి కుటుంబ స‌భ్యులు, పోలీసులు అశ్రున‌య‌నాల న‌డుమ అంతిమ సంస్కారాలు నిర్వ‌హించారు. ఆసుప‌త్రిలో మూడు రోజుల‌పాటు చికిత్స పొందిన మ‌హిపాల్ రెడ్డిని బ్రెయిన్ డెడ్ గా ప్ర‌క‌టించారు వైద్యులు.

దీంతో.. కుటుంబ స‌భ్యులు గుండెల‌విసేలా రోదించారు. అనంత‌రం ఆయ‌న అవ‌య‌వాలను దానం చేసేందుకు అంగీక‌రించారు. ఈ మేర‌కు మ‌హిపాల్ రెడ్డి క‌డ్నీలు, కాలేయం త‌దిత‌ర అవ‌య‌వాల‌ను వైద్యులు సేక‌రించారు. అవ‌య‌వ దానం అనంత‌రం ఆయ‌న స్వ‌గ్రామం కిస్మ‌త్ పూర్ లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

అద‌న‌పు డీపీజీ స‌జ్జ‌నార్ కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. అనంత‌రం మ‌హిపాల్ రెడ్డి పాడెమోశారు. అంత్య‌క్రియ‌ల ఖ‌ర్చుల కోసం రూ.50 వేలు వ్య‌క్తిగ‌త స‌హాయం చేశారు. విధి నిర్వ‌హ‌ణ‌లో మ‌హిపాల్ రెడ్డి ప్రాణాలు కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డ‌పొద్ద‌ని ఎంత‌గా చెబుతున్నా వాహ‌న‌దారులు విన‌డం లేద‌ని అన్నారు. మ‌హిపాల్ రెడ్డి మృతికి కార‌ణ‌మైన వారిని వ‌దిలిపెట్ట‌బోమ‌ని, చ‌ట్ట ప్ర‌కారం క‌ఠినంగా శిక్షిస్తామ‌ని తేల్చి చెప్పారు.

శ‌నివారం నిజాంపేట్ రోడ్డులో డ్రంకెన్ డ్రైవ్ విధులు నిర్వ‌హిస్తుండ‌గా.. మ‌ద్యం మ‌త్తులో అతివేగంగా దూసుకొచ్చిన ట్యాక్సీ కారు మ‌హిపాల్ రెడ్డిని ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన మ‌హిపాల్ రెడ్డి కోమాలోకి వెళ్లారు. అప్ప‌టి నుంచి వెంటిలేట‌ర్ పైనే చికిత్స పొందుతున్న ఆయ‌న‌.. మూడు రోజుల త‌ర్వాత బుధ‌వారం తుదిశ్వాస విడిచారు.
Tags:    

Similar News