తమిళుడిగా చెప్పుకోవచ్చు.. కానీ క్రిష్ణా ఎల్లా పక్కా తెలుగోడు

Update: 2021-12-24 09:33 GMT
కరోనాకు ముందు క్రిష్ణా ఎల్లా అన్నంతనే.. ఎవరు ఆయన? అన్న ప్రశ్న వేసేవారు. నిజానికి అప్పటికే ఆయన పేరున్న ఒక ఫార్మా కంపెనీకి ఎండీ అయినప్పటికీ.. ఆయనకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు పెద్దగా రాలేదు. ఆ మాటకు వస్తే.. ప్రచారానికి దూరంగా ఉంటూ.. పనితో తన సత్తా చాటే తీరు ఆయనకు ఎక్కువ.

మీడియాకు దూరంగా.. తన పని తాను చేసుకుంటూ పోతారు. ఆయనకు మీడియా ఎంత దగ్గరకు వెళ్లాలన్న కొద్దీ దూరమవుతుంటారు. ప్రచారానికి ఇష్టపడని ఆయనకు చెందిన భారత్ బయో కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా వేళ.. దానికి చెక్ పెట్టే వ్యాక్సిన్ తయారీకి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి.

దాదాపు వందకు పైగా సంస్థలు వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తే.. అందులో సక్సెస్ అయినవి చాలా కొద్ది కంపెనీలు. ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొని మరీ.. ప్రభావవంతమైన కొవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీలో క్రిష్ణా ఎల్లా పోషించిన పాత్ర తెలుగు వారందరికి గర్వకారణంగా చెప్పాలి.

కొవాగ్జిన్ సామర్థ్యంతో కొత్త వేరియంట్లను కూడా తట్టుకుంటుందన్న విషయం ఇప్పటికే పలు పరిశోధనలు స్పష్టం చేసినా.. దానిపై పెద్ద ఎత్తున విష ప్రచారం జరిగింది. తాజాగా ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ నోటి నుంచి రావటం గమనార్హం.

ఫైజర్ లాంటి పెద్ద కంపెనీలతో పోటీ పడి.. కొవాగ్జిన్ టీకాను తయారు చేసిన క్రిష్ణా ఎల్లా మీద ప్రపంచ ఆరోగ్య సంస్థకు విదేశీ కంపెనీలే కాదు.. తెలుగువారు సైతం కంప్లైంట్లు చేసిన వైనాన్ని చెప్పి.. తెలుగు వారికి ఐకమత్యం కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్రిష్ణ ఎల్లా గురించి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్య చేశారు.

ఆయన తమిళుడని చెప్పుకుంటారని.. తెలుగువారిగా చెప్పుకోరన్నారు. ‘ఆయనకు ఆయన తమిళుడిగా అనుకోవచ్చు. కానీ.. ఆయన అసలుసిసలు తెలుగైనవాడు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఆయన జన్మించారు. ఆయన పక్కా తెలుగువారు. ఆయన్ను ఆయన తమిళుడిగా చెప్పుకున్నా.. అసలుసిసలు తెలుగువాడే’ అని పేర్కొన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలకు స్పందనగా క్రిష్ణ ఎల్లా చిరునవ్వులు చిందించారు.


Tags:    

Similar News