ఆగని కృష్ణమ్మ వరద ఉగ్రరూపం!

Update: 2019-08-15 20:24 GMT
కృష్ణా నది తన ఉగ్రరూపాన్ని కొనసాగిస్తూ ఉంది. ఆ నదిపై నిర్మించిన ప్రాజెక్టులు అన్నీ పొంగిపొర్లుతూ ఉన్నాయి. గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని రీతిలో కృష్ణా నదికి ఈ సారి వరదలు వచ్చిన సంగతి తెలిసిందే.  ప్రతియేటా శ్రీశైలం వద్ద రెండు మూడు గేట్లను ఎత్తితే అదే పదివేలు అన్నట్టుగా ఉండేది పరిస్థితి. శ్రీశైలం డ్యామ్ నిండి గేట్లు ఎత్తితే చాలు అనుకునే పరిస్థితి నుంచి అక్కడ నుంచి భారీగా  వరద నీరు నాగార్జున సాగర్ కు చేరుతూ ఉంది. నాగార్జున సాగర్ కూడా నిండి అక్కడ నుంచి కూడా నీటిని భారీగా కిందకు విడుదల చేస్తూ ఉన్నారు.

అయితే ఇంకా కృష్ణమ్మ శాంతించిన దాఖలాలు కనిపించడం లేదు. నాగార్జున సాగర్ కు భారీగా వరద కొనసాఉగూత ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ నుంచి ప్రవాహం కొనసాగుతూ ఉండటంతో దిగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటిని ఇంకా భారీగా కిందికి వదులుతూ ఉన్నారు.

పులిచింతల ప్రాజెక్టు నుంచి ఆరు లక్షల క్యూసెక్కుల పై స్థాయి లో నీటిని కిందకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా నాలుగు లక్షల పై స్థాయి క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.  

ఈ వరద ప్రభావం వల్ల లంక గ్రామాలకు ముప్పు పొంచి ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం కూడా వరద ముప్పును ఎదుర్కొనడానికి రెడీ అయ్యిందని తెలుస్తోంది. భారీగా వరద నీరు కడలివైపు సాగుతూ ఉంది.
Tags:    

Similar News