పాత‌బ‌స్తీకి నిధులు పారిస్తార‌ట‌

Update: 2017-04-19 06:07 GMT
టార్గెట్ సెట్ చేసుకోవ‌టం. ఆ దిశ‌గా అడుగులు వేయ‌టం.. లక్ష్య‌సాధ‌న‌లో భాగంగా ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం కావ‌టం లాంటివి టీఆర్ ఎస్‌ లో చూస్తాం. ప్ర‌త్య‌ర్థుల విష‌యంలో ఎలాంటి ద‌యాదాక్షిణ్యాలు లేకుండా వ్య‌వ‌హ‌రించ‌టం ఆ పార్టీకి అల‌వాటే. అవ‌స‌ర‌మైన‌ప్పుడు పూసుకునే ఆ పార్టీ.. అవ‌స‌రం అయ్యాక ఎంత నిర్దాక్షిణ్యంగా వ్య‌వ‌హ‌రిస్తుందో.. ఆ పార్టీ గ‌త చ‌రిత్ర‌ను చూస్తే ఇట్టే తెలుస్తుంది. అలాంటి పార్టీ.. మ‌జ్లిస్ విష‌యానికి వ‌స్తే మాత్రం కాస్త భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. మ‌జ్లిస్ పైకి చెప్ప‌కున్నా.. ఆ పార్టీ త‌మకు ఫ్రెండ్లీ పార్టీ అంటూ ఒక‌టికి పదిసార్లు చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది.

మ‌రింత ఫ్రెండ్లీ పార్టీ మీద గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో పోటీ ఎందుక‌న్న ప్ర‌శ్న‌కు గులాబీ నేత‌ల నుంచి స‌మాధానం ఉండ‌దు. అసెంబ్లీలోనూ.. బ‌య‌టా మ‌జ్లిస్ త‌మ‌కు స్నేహ‌పూర్వ‌క పార్టీ అని గులాబీ నేత‌లు చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది కానీ.. నిజానికి ఆ పార్టీ అలా వ్య‌వ‌హ‌రిస్తుందా? అన్న‌ది అంద‌రికి తెలిసిందే. మిగిలిన పార్టీలు ఏమైనా త‌మ‌ను ప్ర‌శ్నించినా.. విమ‌ర్శించినా వెంట‌నే వారిపై విరుచుకుప‌డే గులాబీ నేత‌లు.. మ‌జ్లిస్ విష‌యంలో మాత్రం కాస్త భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

పాత‌బ‌స్తీని వ‌దిలేసి.. మ‌జ్లిస్‌ తో దోస్తానా చేస్తే.. మిగిలిన రాష్ట్రంలో మైనార్టీల ఓట్ల వాటా త‌మ‌దే అవుతుంద‌న్న ఒక వ్యూహ‌మే.. మ‌జ్లిస్‌ ను టీఆర్ ఎస్‌ కు ఫ్రెండ్లీ పార్టీగా చేసింద‌ని చెప్పాలి. తాజాగా.. త‌మ ఫ్రెండ్లీ పార్టీ కోట‌లోకి పాగా వేయాల‌ని టీఆర్ ఎస్ భావిస్తుందా? అంటే.. అవున‌న్న మాట చెప్పాల్సిన ప‌రిస్థితి. అభివృద్ధి కార్య‌క్ర‌మాల పేరుతో మ‌జ్లిస్ అడ్డాలోకి బుడిబుడి అడుగులు వేయాల‌ని తెలంగాణ అధికార‌ప‌క్షం త‌పిస్తోంద‌న్న మాట వినిపిస్తోంది.

గ్రేట‌ర్ అభివృద్ధిలో భాగంగా కొత్త న‌గ‌రంతో స‌మానంగా పాత‌బ‌స్తీకి త‌గిన నిధులు కేటాయించి.. అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామ‌ని చెబుతున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌. రాబోయే మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో రూ.27కోట్ల వ్య‌యంతో సిటీలోని 16 ప్రాంతాల్లో క‌మ్యూనిటీ హాళ్ల‌ను అందుబాటులోకి తెస్తామ‌న్నారు. పాత‌బ‌స్తీలోని మొఘ‌ల్ పూరా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌.. ఫ‌రూఖ్ న‌గ‌ర్ బ‌స్ డిపో టెర్మిన‌ల్ కాంప్లెక్స్‌.. మైలార్ దేవ్ ప‌ల్లి ప్లే గ్రౌండ్ స‌హా ప‌లు ప్రాంతాల్లో ఏసీ టాయిలెట్స్‌ ను డిప్యూటీసీఎం మ‌హ‌మూద్ అలీ.. మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ క‌లిసి కేటీఆర్ ప్రారంభించ‌టం గ‌మ‌నార్హం.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన కేటీఆర్‌.. చార్మినార్ కాలిబాట ప‌థ‌కాన్ని.. మూసీ సుంద‌రీక‌ర‌ణను త్వ‌ర‌లోనే పూర్తి చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. స‌బ‌ర్మ‌తీ త‌ర‌హాలో మూసీ సుంద‌రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తామ‌ని చెప్పిన కేటీఆర్‌.. తాజ్ ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ ను న‌గ‌రానికి ఒక ఐకాన్ గా మారింద‌న్నారు. ఈ ప్రాంతంలో ఫ‌ల‌క్ నుమా రైల్వే బ్రిడ్జ్ విస్త‌ర‌ణ‌కు తాము సిద్ధంగా ఉన్నామ‌న్న ఆయ‌న మ‌హబూబ్ చౌక్  లోని క్లాక్ ట‌వ‌ర్ మ‌ర‌మ్మ‌తుల‌కు రూ.5 కోట్ల‌ను వారం వ్య‌వ‌ధిలో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఫ‌ల‌క్ నుమా పీటీవో ప్రాంతంలో 10 ఎక‌రాల పోలీస్ స్థ‌లానికి సంబంధించి హోంమంత్రితో మాట్లాడి..సెట్ చేస్తామ‌న్న కేటీఆర్‌.. పాత‌బ‌స్తీలో తాగునీరు.. విద్యుత్‌..డ్రైనేజీ స‌మ‌స్య‌లకు శాశ్విత ప‌రిష్కారం కోసం తాము కృషి చేస్తామ‌ని చెప్పారు. తాజాగా పాత‌బ‌స్తీ మీద ఫ్రెండ్లీ డెవ‌ల‌ప్ మెంట్ తీరు చూస్తే.. ప‌క్కాగా ఫ్యూచ‌ర్ ప్లాన్ ఏదో గులాబీ అధినాయ‌క‌త్వం సెట్ చేసింద‌న్న భావ‌న క‌ల‌గ‌క మాన‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News