కేటీఆర్..క‌విత‌లు చెరొక‌టి చొప్పున ప్ర‌క‌టించారు

Update: 2018-09-05 05:52 GMT
ముంద‌స్తుకు సంబంధించిన అధికారిక అనౌన్స్ మెంట్ వెలువ‌డ‌క‌ముందే.. అసెంబ్లీకి జ‌రిగే ఎన్నిక‌ల్లో ఇద్ద‌రు అధికార‌పార్టీ అభ్య‌ర్థుల్ని అధికారికంగా ప్ర‌క‌టించేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. టీఆర్ఎస్ రాను.. రాను ఫ్యామిలీ పార్టీగా మారుతోంద‌న్న విమ‌ర్శ‌లు ఎక్కువ అవుతున్నాయి. దీనికి త‌గ్గ‌ట్లే.. తాజాగా మ‌రో బ‌ల‌మైన ఆధారం ల‌భించిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థులు ఎవ‌ర‌న్న‌ది అధికారికంగా డిసైడ్ చేయాల్సింది పార్టీ అధినేత కేసీఆర్‌. లేదంటే.. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో ఉన్న వారు అనౌన్స్ చేస్తారు. ఇందుకు భిన్నంగా కేసీఆర్ కుమారుడు క‌మ్ మంత్రి కేటీఆర్ ఒక అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తే.. మ‌రో నియోజ‌క‌వ‌ర్గానికి టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా ఎంపీ క‌మ్ కేసీఆర్ కుమార్తె క‌విత మ‌రొక‌రిని అనౌన్స్ చేశారు.

కామారెడ్డి ప్ర‌స్తుత ఎమ్మెల్యే.. ప్ర‌భుత్వ విప్ గంప గోవ‌ర్ద‌న్ పేరును కేటీఆర్ తెలంగాణ భ‌వ‌న్ లో ప్ర‌క‌టించారు. భారీ మెజార్టీతో గెలుస్తార‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. వ‌చ్చేఎన్నిక‌ల్లో ఆయ‌న‌దే విజ‌య‌మ‌ని కేటీఆర్ న‌మ్మ‌కంగా చెప్పారు. ఇదిలా ఉంటే.. ఎంపీ క‌విత జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా సంజ‌య్ కుమార్ పేరును ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌దే విజ‌య‌మ‌ని తేల్చారు. ఇదిలా ఉంటే.. ఈ నెల ఏడున మ‌రో ప‌దిమేను మందితో క‌లిసి తొలిజాబితాను ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేతుల మీదుగా విడుద‌ల చేస్తార‌ని తెలుస్తోంది.

హుస్నాబాద్ లో ఏర్పాటు చేస్తున్న భారీ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్‌.. కేటీఆర్‌.. హ‌రీశ్‌.. ఈటెల‌తో పాటు హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రానికి చెందిన మ‌రో ముగ్గురు అభ్య‌ర్థుల పేర్లు కూడా తొలి జాబితాలో ఉండొచ్చ‌ని చెబుతున్నారు. వీరిలో  మంత్రులు త‌ల‌సాని.. ప‌ద్మారావుల‌తో పాటు కూక‌ట్ ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం.. కుత్బుల్లాపూర్ వివేక్.. శేరిలింగంప‌ల్లి గాంధీల పేర్లు ఉండొచ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News