వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ గా తొలి ఎంపీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన కేటీఆర్‌

Update: 2019-01-03 14:53 GMT
తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న బాధ్య‌తల స్వీక‌ర‌ణ‌లో మ‌రింత దూకుడు పెంచారు. ఇప్ప‌టివ‌ర‌కు పార్టీలోని వివిధ స్థాయిల నేత‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హించిన ఆయ‌న తాజాగా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ - త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో ఏకంగా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు. సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధం అవ‌డం గురించి పార్టీ నేత‌ల‌కు వివ‌రించారు. `పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. సిరిసిల్ల నియోజకవర్గంలో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు నా ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 15 లక్షలు ఇస్తానని కేటీఆర్ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ లేకుండా చూసుకోవాలి. లక్ష్మీపూర్ తండా స్ఫూర్తితో సిరిసిల్ల నియోజకవర్గంలో ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం కావాలి` అని కేటీఆర్ అన్నారు.

2019 ఎన్నికల నామ సంవత్సరమ‌ని కేటీఆర్ చ‌మ‌త్క‌రించారు. ``ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీని ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారు. తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైంది. ముందస్తు ఎన్నికలకు పోయి గెలిచిన ఘనత సీఎం కేసీఆర్‌. రాహుల్ గాంధీ - చంద్రబాబు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు. ప్రధాని మోదీ - అమిత్ షా - ఐదు రాష్ర్టాల ముఖ్యమంత్రులు - పలువురు కేంద్రమంత్రులు ప్రచారం చేసినా ప్రజలు బీజేపీని తిరస్కరించారు. విపక్షాలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు లొంగలేదు. `త్వరలో పంచాయతీ - పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ ఎస్ పార్టీకి కార్యకర్తలే ప్రాణవాయువు. సిరిసిల్ల నియోజకవర్గంలో 71 శాతం ఓట్లు టీఆర్ ఎస్ కే పడ్డాయి. పంచాయతీ ఎన్నికల్లో అవకాశం రాని వారికి సొసైటీ - జడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. ట్రక్కు గుర్తు వల్ల మనకు ఓట్లు తగ్గిపోయాయి. 4 వేల ఓట్ల తేడాతో 10 సీట్లు కోల్పోయాం. అలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌నివ్వ‌ద్దు`` అని సూచించారు.

సంక్షేమ - అభివృద్ధి పథకాలను కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్‌ చెప్పారు. ``సీఎం కేసీఆర్ కాలంతో పోటీపడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని పలు రాష్ర్టాలు అమలు చేస్తున్నాయి. రైతుల పక్షాన నిలబడకపోతే రాజకీయంగా పుట్టగతులుండవని ప్రధాని మోడీకి అర్థమైంది. రైతుబంధు పథకాన్ని దేశమంతా అమలు చేయాలని ప్రధాని మోడీ ఆలోచిస్తున్నారు`` అని తెలిపారు. రాబోయే ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంటు నుంచి బ‌రిలో దిగేది ప్ర‌స్తుత ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్‌ కుమార్ అని కేటీఆర్ ప్ర‌క‌టించారు. త‌ద్వారా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి బ‌రిలో దిగ‌బోయే తొలి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు.


Full View


Tags:    

Similar News