తెలంగాణ జిందాతిలిస్మాత్ గా కేటీఆర్.. ఇదేం లెక్క?

Update: 2021-05-18 03:47 GMT
నొప్పి.. జలుబు.. ముక్కు పట్టేయటం.. ఇలా అనారోగ్యం ఏదైనా సరే.. చిటికెలో పని చేస్తుందన్న పేరు జిందా తిలిస్మాత్ సొంతం. అన్ని అనారోగ్యాలకు చెక్ చెప్పే మందు ఎలా అయితే ఆల్ ఇన్ వన్ గా ఉంటుందో.. తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ అదే పాత్రను పోషిస్తున్నారు. ఒక ప్రభుత్వం అన్న తర్వాత తనకంటూ ఒక విధానం ఉండాలి. తనకంటూ ఒక కేరక్టర్ చాలా ముఖ్యం. అందుకు భిన్నంగా.. వ్యవస్థలు మొత్తం చేష్టలుడిగిపోయి.. ఎవరేం చెప్పినా ఎలాంటి పని జరగకుండా పోవటం ఏ మాత్రం మంచిది కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది.

ఇటీవల కాలంలో గమనిస్తే.. ఆసుపత్రిలో బెడ్డు కావాలన్నా.. ఆక్సిజన్ సిలిండర్ కావాలన్నా.. చివరకు డెత్ సర్టిఫికేట్ ఇప్పించాలన్నా మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకోవాల్సి రావటం ఏమిటి? ఒక రాష్ట్రంలో పాలన అనే గుండెకాయ తనంతట తాను పని చేసేలా ఉండాలే తప్పించి.. నిత్యం మంత్రి కేటీఆర్ తన ఆదేశాలతో దాన్ని పని చేసేలా చేయటం దేనికి నిదర్శనం.

మంత్రి కేటీఆర్ స్థాయి ఏమిటి? ఆయన ఎలాంటి అంశాల్ని పట్టించుకోవాలి? అధికారుల్ని ఏయే విషయాల్లో అలెర్టు చేయాలనే దానికి కనీసం ఒక స్థాయి ఉండాలి. అదేం దరిద్రమో కానీ.. ఇటీవల కాలంలో ఆయన స్పందించాల్సి వస్తున్న విషయాల్ని చూస్తే.. తెలంగాణలో పాలనా వ్యవస్థ జాడ లేకుండా పోయిందా? అన్న సందేహం కలుగక మానదు. మొన్నటికి మొన్న ప్రైవేటు ఆసుపత్రిలో బిల్లు ఎక్కువ వేశారంటూ వాపోతూ.. కేటీఆర్ కు ట్వీట్ చేస్తే.. ఆయన స్పందించటం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఆ పని అప్పజెబితే కానీ.. సదరు సామాన్యుడికి న్యాయం జరగని పరిస్థితి.

ఇలా నిత్యం ప్రతి సమస్యకు పరిష్కారంగా మంత్రి కేటీఆర్ కనిపించటం ఏమిటి? తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ జోక్యం లేకుండా.. ఆయన మాట ఆదేశంగా మారనంత వరకు ఏ పని జరగదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.  ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రానికి మంచిది కాదన్నది మర్చిపోకూడదు. వ్యవస్థలన్నవి స్వయం ప్రకాశితాలుగా ఉండాలే కానీ.. మంత్రి కేటీఆర్ లాంటి వారు కల్పించుకొని.. అదిలించి.. బెదిరించి.. పరుగులు తీయించి పనులు పూర్తి చేయటం చూస్తే.. తెలంగాణలో పాలనా వ్యవస్థ పూర్తిగా పడకేసిందా? అన్న సందేహం కలుగక మానదు. తెలంగాణ రాష్ట్రానికి జిందాతిలిస్మాత్ గా కేటీఆర్ మారటం బలం కాదు బలహీనత అన్న విషయాన్ని ఎప్పటికి గుర్తిస్తారో?
Tags:    

Similar News