ఓవైసీ చెప్పాడు.. కేటీఆర్ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్

Update: 2018-11-19 04:43 GMT
కేటీఆర్‌.. తెలంగాణ‌లో ప‌వ‌ర్ సెంట‌ర్. మ‌రి.. అలాంటి ప‌వ‌ర్ ను సైతం కంట్రోల్ చేసేటోడు ఉన్నాడా? అంటే.. ఉన్నాడ‌ని చెబుతున్నారు. కేటీఆర్ మాత్ర‌మే కాదు.. కేసీఆర్‌ను సైతం త‌న మాట‌తో ప్ర‌భావితం చేసే స‌త్తా ఉన్న ఒకే ఒక్క‌డు మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీగా చెప్ప‌క త‌ప్ప‌దు. త‌న మాట‌ల‌తో కోట్లాదిమందిని ప్ర‌భావితం చేసే మాట‌ల మ‌రాఠిగా పేరున్న కేసీఆర్‌ ను త‌న మాట‌ల‌తో ప్ర‌భావితం చేసే అధినేత‌గా అస‌ద్‌ ను చెప్పాలి.

అస‌ద్ అంటే అంత అభిమానం ఎందుకంటే.. మైనార్టీ ఓట్లు గంప‌గుత్త‌గా టీఆర్ ఎస్‌ కు మ‌ళ్లించుకునే వెసులుబాటు ఉండ‌టం. అంతేనా.. అప్ప‌ట్లో చంద్ర‌బాబు ఓట్ల‌కు కోట్ల కుట్ర‌ను  ముందుగా స్మెల్ చేసి.. త‌న‌ను అలెర్ట్ చేసినందుకు అస‌ద్ అంటే చెప్ప‌లేనంత అభిమానంగా చెబుతుంటారు. అందుకే.. 119 సీట్ల‌లో మ‌జ్లిస్ కు చెందిన ఏడు సీట్ల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోన‌న్న విష‌యాన్ని బాహాటంగా చెప్పేస్తుంటారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. మ‌జ్లిస్ త‌మ‌కు స్నేహితుడ‌ని త‌ర‌చూ చెప్పే కేసీఆర్ వైఖ‌రికి భిన్నంగా మ‌జ్లిస్ అధినేత కానీ ఆయ‌న త‌మ్ముడు కానీ టీఆర్ ఎస్ మీద అంత‌లా ప్రేమ కురిపించిన సంద‌ర్భాలు త‌క్కువే. అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ అసెంబ్లీలో గులాబీ బాస్ దుమ్ము దులిపే ప్రోగ్రామ్‌ ను అక్బ‌రుద్దీన్ అప్పుడ‌ప్పుడు చేస్తుంటారు.

అయిన‌ప్ప‌టికీ కిమ్మ‌న‌కుండా ఉండే కేసీఆర్.. తాజాగా ఎన్నిక‌ల సంద‌ర్భంగా మ‌జ్లిస్ మాట‌ను జ‌వ‌దాట‌టం లేద‌ని చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కేసీఆర్‌ ను ఇన్ ఫ్లూయిన్స్ చేయ‌గ‌లిగిన స‌త్తా ఉన్న అధినేత‌ల్లో అస‌దుద్దీన్ ఓవైసీ ఒక‌ర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆయ‌న ప్ర‌భావం ఎంతన్న విష‌యాన్ని తెలిసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆదివారం మ‌జ్లిస్ అడ్డా అయిన కార్వాన్ నియోజ‌క‌వ‌ర్గ పరిధిలో మైనార్టీల‌తో స‌మావేశం అయ్యేందుకు మంత్రి కేటీఆర్ ప్లాన్ చేసుకున్నారు. ఇదే విష‌యాన్నిమీడియాకు తెలియ‌జేశారు.

కానీ.. కొద్దిసేప‌టికే కేటీఆర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యింద‌న్న స‌మాచారం అందింది. క్యాన్సిల్ ఎందుక‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం రాని ప‌రిస్థితి. ఎన్నిక‌ల వేళ‌.. కేటీఆర్ లాంటి నేత ప్రోగ్రామ్ ర‌ద్దు ఎందుకైంద‌న్న‌ది ఆరా తీస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఎంత స్నేహితుడైనా.. ఎంత జిగిరి దోస్తానా ఉన్నా.. తెలుగు సామెత మాదిరే ఎక్క‌డైనా బావ కానీ వంగ తోట ద‌గ్గ‌ర కాద‌న్నట్లుగా.. ఎంత స్నేహితుడైనా స‌రే త‌న అడ్డాలోకి కేటీఆర్ రావ‌టం అస్స‌లు న‌చ్చ‌లేద‌ట‌. మ‌జ్లిస్కు కోట లాంటి కార్వాన్ నియోజ‌క‌వ‌ర్గంలో కేటీఆర్ ప్రోగ్రామ్ షెడ్యూల్ తెలిసినంత‌నే రియాక్ట్ అయిన అస‌ద్‌.. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవాల‌ని కోరార‌ట‌.

అస‌ద్ అడిగితే కేటీఆర్ కాదంటారా?  త‌న ప్రోగ్రామ్‌ ను క్యాన్సిల్ చేసుకున్నారు. రాష్ట్రం మొత్తాన్ని త‌న క‌నుసైగ‌తో కంట్రోల్ చేసే కేటీఆర్ ను.. త‌న మాట‌తో ఆపేసే స‌త్తా అస‌ద్ కు ఉంద‌న్న విష‌యం తాజా ఉదంతంతో మ‌రోసారి రుజువైంద‌న్న మాట గులాబీ పార్టీలో ఇప్పుడు జోరుగా వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. 
Tags:    

Similar News