కేటీఆర్ - హరీష్.. మెజారిటీ విషయంలో సవాల్!

Update: 2019-03-08 12:49 GMT
తమకు వేరే ఎవరూ పోటీ కాదు అని.. తమకు తామే పోటీ - తమకు తామే సాటి.. అని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు హరీష్ రావు - కేటీఆర్. ఇక్కడ పోటీ అంటే.. వాళ్లిద్దరూ కేసీఆర్ వారసత్వం గురించి పోటీ పడటం కాదు. తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించడం విషయంలో పోటీ అని అంటున్నారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా.. మెదక్ ఎంపీ సీటు పరిధి లో జరిగిన మీటింగులో కేటీఆర్ - హరీష్ లు ఈ విషయంలో సవాళ్లు విసురుకున్నారు.

తెలంగాణలో తెరాసకు ఏ పార్టీతోనూ పోటీనే లేదు అని వారు అన్నారు. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తెరాసకు పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేవని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో వార్ వన్ సైడే అని వ్యాఖ్యానించారు. ఎలాగూ విజయం ఖరారు అయిన నేపథ్యంలో మెజారిటీ విషయంలో మాత్రమే ఇక పోటీ పడటం జరుగుతుందని ఈ ఇద్దరు నేతలూ అన్నారు.

హరీష్ రావు మాట్లాడుతూ.. మెదక్ లో తెలంగాణ రాష్ట్ర సమితి కనీసం ఐదు లక్షల మెజారిటీతో విజయం సాధించాలని అన్నారు. ఆ భారీ మెజారిటీని సాధించి కేసీఆర్ పై గౌరవాన్ని చూపించాలని అన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ.. మెదక్ ఎంపీ సీటు పరిధిలో.. కరీంనగర్ కు మించిన స్థాయిలో మెజారిటీ రావాలని అన్నారు.

తెరాస ఎంపీ అభ్యర్థులకు మెజారిటీ విషయంలో కరీంనగర్ - మెదక్ ల మధ్య పోటీ అని అన్నారు. తాము మెదక్ కన్నా ఎక్కువ మెజారిటీ తెప్పించేందుకు కష్టపడతామని.. వ్యాఖ్యానించిన కేటీఆర్.. కరీంనగర్ కన్నా ఎక్కువ మెజారిటీ తెచ్చుకోవడానికి మెదక్ పోటీ పడాలని సవాల్ విసిరారు. ఆ సవాల్ ను హరీష్ రావు స్వీకరించారు. మెజారిటీ విషయంలో కరీంనగర్ - మెదక్ ల మధ్యన పోటీ అని..ఎవరు ఎక్కువ మెజారిటీతో పార్టీని గెలిపిస్తారో చూద్దామని అన్నారు.

తన బావ హరీష్ రావుతో తనకు ఎలాంటి విబేధాలు లేవు అని.. కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమ మధ్య సత్సంబంధాలున్నాయని అన్నారు.  సందర్భంగా ఒంటేరు ప్రతాపరెడ్డితో కేటీఆర్ సభకు ప్రత్యేకంగా అభివాదం చేయించడం ఆసక్తిదాయకంగా నిలిచింది! మొత్తానికి మెజారిటీ విషయంలో సవాళ్లు చేసుకునేంత స్థాయిలో ఉన్నాయి తెరాసలోని కాన్ఫిడెన్స్ లెవల్స్!
Tags:    

Similar News