మ‌హేంద‌ర్‌రెడ్డికి కేటీఆర్ క్లాస్‌.. ఏం జ‌రిగిందంటే!

Update: 2022-04-29 03:55 GMT
తాండూరు సీఐ దూషణ వ్యవహారంపై ఎమ్మెల్సీ ప‌ట్నం మహేందర్‌రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. గురు వారం ఉద‌యం నుంచి కూడా ఆయ‌న పోలీసుల‌ను దూషించిన ఆడియో త‌న‌ది కాద‌ని.. చెప్పుకొచ్చారు. కానీ, సాయంత్రానికి మొత్తానికి మొత్తంగా.. యూటర్న్ తీసుకున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై విచారం వ్యక్తం చేశారు. పొరపాటున నోరుజారి మనసు నొప్పించినందుకు విచారిస్తున్నానని తెలిపారు. పోలీసులు తన కుటుంబ సభ్యులతో సమానమని పేర్కొన్నారు.

పోలీసుల మనస్సు నొప్పిస్తే తనకు బాధగా ఉంటుందన్న ఆయన... రాష్ట్రఆవిర్భావం, అభివృద్ధిలో పోలీసుల కృషి అభినందనీయమని కొనియాడారు. పోలీసులంటే ఎనలేని గౌరవం ఉందన్నారు. పొర పాటున నోరుజారి మనసు నొప్పించినందుకు విచారిస్తున్నా.

పోలీసులు నా కుటుంబ సభ్యులతో సమానం. పోలీసుల మనస్సు నొప్పిస్తే నాకు బాధగా ఉంటుంది. రాష్ట్రఆవిర్భావం, అభివృద్ధిలో పోలీసుల కృషి అభినందనీయం. పోలీసులంటే ఎనలేని గౌరవం ఉంది. అని మీడియాను పిలిచి మ‌రీ చెప్పారు.

ఏం జ‌రిగింది?

టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఫోన్లో పరుష పదజాలం ఉపయోగిస్తూ సీఐని బెదిరించారు. మూడు రోజుల కిందట తాండూరు పట్టణంలోని భద్రేశ్వర ఆలయం జాతరలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్తో వచ్చిన రౌడీషీటర్లకు పోలీసులు సహకరించారని ఆ ఆడియోలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆరోపించారు.

కార్పెట్ ఎందుకు వేశారంటూ సీఐని దుర్భాషలాడుతూ నిలదీశారు. స్పందించిన సీఐ కార్పెట్ వేయడం, తీయడం మా పని కాదని సమాధానం ఇవ్వడంతో మరింత ఘాటుగా స్పందించిన మహేందర్ రెడ్డి... నీ అంతూ చూస్తానంటూ బెదిరించారు. ఈ ప‌రిణామాలు గురువారం ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు కూడా రాష్ట్రంలో రాజ‌కీయాల‌ను వేడెక్కించాయి.

కేటీఆర్ క్లాస్‌!

అయితే.. ఉద‌యం నుంచి అన్ని మీడియా చానెళ్ల‌లోనూ.. ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి ఆడియో.. పెద్ద ఎత్తున వైర‌ల్ అయింది. దీనిని ఆయ‌న బుకాయించారు.. అంతేకాదు.. దీనిపై కోర్టులోనే తేల్చుకుంటామ‌న్నారు. అయితే.. మ‌ధ్యాహ్నం 4 త‌ర్వాత ఈ విష‌యంలో మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకున్నార‌ని.. స‌మాచారం.

ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు ఏదో ఒక‌టి ప‌ట్టుకుని స‌ర్కారు ప‌రువు తీస్తున్నాయని.. ఇప్పుడు మీరు కూడా ఇలా చేయ‌డం స‌మంజ‌సం కాద‌ని.. వెంట‌నే.. పోలీసుల‌కు సారీ చెప్పాల‌ని ఆదేశించారు. దీంతో ప‌ట్నం దిగివ‌చ్చార‌ని.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి సీఐ వ‌ర్సెస్ ప‌ట్నం వివాదం.. టీ క‌ప్పులో తుఫానులా చ‌ల్లారిపోవ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News