లాలు క‌ష్టాలే బాబుకు వ‌స్తాయంటున్న కేటీఆర్‌

Update: 2017-11-15 15:03 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ మ‌రోమారు తెలుగుదేశం పార్టీపై విరుచుకుప‌డ్డారు. తెలంగాణ‌లో ఇప్ప‌టికే కుద‌లేయిపోయిన టీడీపీని మ‌రింత చావుదెబ్బ తీసే ఆప‌రేష‌న్‌ను శ‌ర‌వేగంగా ముందుకు తీసుకుపోతున్న టీఆర్ఎస్..ఈ క్ర‌మంలో పెద్ద ఎత్తున వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా భారీ స్థాయిలో నేత‌ల‌కు గులాబీ కండువా క‌ప్పారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ రావు, మంథని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కర్రు నాగయ్య,
రాజన్న సిరిసిల్లా జిల్లా టీడీపీ అధ్యక్షుడు అన్నమనేని నరసింగరావు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేరారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

పూర్వ కరీంనగర్, పూర్వ వరంగల్ జిల్లాల్లో టీడీపీ ఇక లేదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. చరిత్రలో కొన్ని మలుపులు అనివార్యంగా వస్తాయని వాటిని అంగీక‌రించాల‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆగడాలను అంతమొందించడానికి నందమూరి తారక రామారావు టీడీపీ పార్టీని  ఏర్పాటు చేశారని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ధ్యేయంగా టీఆర్ఎస్‌ పార్టీ ఉద్భవించిందని వివ‌రించారు. బీహార్-జార్ఖండ్ విడిపోయినపుడు లాలూ పార్టీ జార్ఖండ్‌లో ఉనికి కోల్పోయినట్లు తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోయిందని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఢిల్లీ మోచేతి నీళ్లు తాగుతున్న కాంగ్రెస్ కు ఇక్క పుట్టగతులుండవని కేటీఆర్ తేల్చిచెప్పారు. దేశం లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న జ్యోతిబసు రికార్డ్ ని సీఎం కేసీఆర్ తిరగరాస్తారని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. గండ్ర సత్యనారాయణరావు చేరికతో భూపాలపల్లి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని అన్నారు.

ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి మాట్లాడుతూ ఇక రాష్ట్రం లో టీడీపి దుకాణం బంద్ అయింద‌ని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుదామ‌ని ప్ర‌క‌టించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీఆర్ఎస్‌లో చేరిన వివిధ పార్టీల నుండి టీఆర్ఎస్‌లో చేరటం సంతోష‌క‌ర‌మ‌న్నారు. గండ్ర సత్యనారాయణ రావు పార్టీలోకి రావడం చాలా సంతోషమ‌ని అన్నారు. తెలంగాణ ఏర్పాటే ధ్యేయంగా టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరాన‌ని, కష్టపడి సాధించున్న తెలంగాణను దేశం లోనే గొప్పగా అభివృద్ధి చేసుకోవాలని ఆయ‌న పిలుపునిచ్చారు.
Tags:    

Similar News