రాహుల్‌...రేవంత్‌ రెడ్డిని ఎంత‌కు కొన్నావు?

Update: 2019-03-04 06:54 GMT
పార్టీ ఫిరాయింపుల ఎపిసోడ్ తెలంగాణ అధికార టీఆర్ ఎస్‌- కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య విమర్శ‌లు ప్ర‌తివిమ‌ర్శ‌లకు దారితీస్తోంది. కీల‌క‌మైన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ముందు ఇద్ద‌రు ఎమ్మెల్సీలు పార్టీని వీడిన నేప‌థ్యంలో, టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్ప‌డుతోంద‌ని కాంగ్రెస్ పార్టీ భ‌గ్గుమ‌న్న సంగ‌తి తెలిసిందే. దీనిపై తాజాగా టీఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా రియాక్ట‌య్యారు. తెలంగాణ భవన్‌ లో మీడియాతో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ...సీఎం కేసీఆర్, టీఆర్‌ ఎస్ పార్టీపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి  చేసిన విమర్శలు, వ్యాఖ్యలు స‌రికాద‌న్నారు. కాంగ్రెస్‌ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, ఆత్రం సక్కు ఆదివాసీల అభివృద్ధి కోసం, తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం టీఆర్‌ ఎస్‌ లో చేరుతున్నట్టు పత్రికా ప్రకటన విడుదల చేశారనే విష‌యాన్ని ఉత్త‌మ్ గ‌మ‌నించాల‌న్నారు.

రాజకీయాల్లో పార్టీలు మారడం కొత్త కాదని.. ఎప్పడికప్పుడు నిర్ణయాలు సమీక్షించుకుంటూ ముందుకు పోవడం కొత్త కాదని కేటీఆర్ అన్నారు. ఇటీవ‌ల శాసనసభ ఎన్నికలకు ముందు టీఆర్‌ ఎస్ నుంచి గెలిచిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కూడా కాంగ్రెస్‌ లో చేరారని, ఆయన్ను ఎంతకు  కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేసింద‌ని ప్ర‌శ్నించారు. `టీఆర్‌ ఎస్ శాసనమండలి సభ్యులు యాదవరెడ్డి, భూపతి రెడ్డి కాంగ్రెస్‌ లో చేరారు. టీఆర్‌ ఎస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్లు. దాని కంటే ఆరు నెలల ముందు 2014లో టీడీపీ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్‌ లో చేరారు. ఆయన్ను ఎంతకు కొన్నారు?  వీటన్నింటికీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి వివరణ ఇస్తే బాగుంటుంది. గిరిజన శాసనసభ్యులు చేరితే వారినీ, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే విధంగా చాలా అహంకారంతో దుర్మార్గంగా చేసిన వ్యాఖ్యలను నేను తప్పు పడుతున్నాను `అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ.. బీజేపీ ఎంపీ సావిత్రీబాయి ఫూలెను కాంగ్రెస్‌ లో ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ ఎంపీని ఎంతకు కొన్నదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీలోని ప‌రిణామాల‌ను కేటీఆర్ ఈ సంద‌ర్బంగా ఎద్దేవా చేశారు. `మా పార్టీలో జోష్ లేదని మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌ గోపాల్ రెడ్డి బాహటంగా చెప్పారు. మా పార్టీలో చేవ చచ్చింది అని రాజగోపాల్‌ రెడ్డి చెప్పినప్పుడు.. ఇతర ఎమ్మెల్యేలను మీరు ఎలా నిందిస్తారు. మీ నాయకత్వంలో సమర్థత లేక.. మీ మీద విశ్వాసం లేక.. వారి ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచించి.. ఆదివాసీల సమస్యలపైన సీఎం కేసీఆర్ ప్రకటన, నిబద్ధతను చూసిన తర్వత మేం ఆయనతో కలిసి నడుస్తామని ఇద్దరు శాసనసభ్యులు చెప్పారు. అవసరమైతే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తామని చెప్పారు. అయినా ఎందుకు ఈ దురహంకారమైన వ్యాఖ్యలు చేశారు?`అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై కేటీఆర్ మండిప‌డ్డారు.
Tags:    

Similar News