దావోస్ లో తెలంగాణ చేసుకున్న ఒప్పందాల లెక్క చెప్పిన కేటీఆర్

Update: 2022-06-02 06:35 GMT
పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు వీలుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రి.. మంత్రి దావోస్ కు వెళ్లటం.. పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకోవటం తెలిసిందే. ఈ సదస్సుకు ఏపీ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరైతే.. తెలంగాణ నుంచి రాష్ట్ర మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. జగన్ తో పోలిస్తే కేటీఆర్ కాస్త ముందుగా దావోస్ చేరుకోవటం.. ఉత్సాహంగా పాల్గొంటూ పలు ఒప్పందాలు చేసుకున్నారు. అందుకు భిన్నంగా ఎలాంటి హడావుడి లేకుండా జగన్ సర్కారు కాస్త ఆలస్యంగా వెళ్లినా.. ఫటాఫట్ ధనా ధన్ రీతిలో ఒప్పందాలు చేసుకుంది.

ఏపీ ప్రభుత్వం చేసుకున్న పెట్టబడి ఒప్పందాల లెక్క విషయానికి వస్తే రూ.1.25 లక్షల కోట్లుగా జగన్ సర్కారు వెల్లడించింది. మరి.. తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల మాటేమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

దీనికి సంబంధించి తాజాగా వెలుగు చూసిన లెక్కల్ని చూస్తే నోట మాట రాదంతే. జగన్ సర్కారు చేసుకున్న భారీ పెట్టుబడి ఒప్పందాలపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం చేసుకున్న మూడు ఒప్పందాలు దేశీయ కంపెనీలు కావటం.. అందులో ఒకటి అదానీ అయితే.. రెండోది విజయసాయి రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థకు కావటాన్ని వేలెత్తి చూపిస్తున్నారు.

ఇక.. తెలంగాణ విషయానికి వస్తే.. దావోస్ పర్యటనతో తమ రాష్ట్రం చేసుకున్న ఒప్పందాల లెక్కను తాజాగా వెల్లడించారు. మొత్తం రూ.4200 కోట్ల పెట్టబడుల్ని తెలంగాణ ఆకర్షించటమే కాదు.. అందుకు తగ్గట్లు ఒప్పందాలు సాగాయి. మొత్తం 25 సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమల్ని స్థాపించనున్నట్లు వెల్లడించారు.  2014లో రాష్ట్రం ఏర్పడిన మొదట్లో దావోస్ కు వెళ్లినప్పుడు రాష్ట్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన వచ్చిందని.. తాజా పర్యటనలో మాత్రం అలాంటి అవసరం రాలేదని.. అందరూ గుర్తించారని చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్.

ఏపీ ప్రభుత్వం చేసుకున్న రూ.1.25 లక్షల కోట్లతో పోల్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు ఒక మూలకు కూడా సరిపోవు. కానీ.. ఏపీకి మించిన పేరు తెలంగాణకు ఎందుకు వచ్చినట్లు? అన్నది ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాల్సి వస్తే.. తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్ని కూడా విదేశీ కంపెనీలు కావటం. ఏయే రంగాల్లో ఎంతేసి పెట్టుబడులు పెట్టనున్నారు?

ఆ పెట్టుబడుల కారణంగా కలిగే మేలుకు సంబంధించిన వివరాల్ని పక్కాగా చెబుతుంటే.. ఏపీ చేసుకున్న మూడు ఒప్పందాలు.. వాటి లోతుపాతుల గురించి వివరాలు పెద్దగా రాకపోవటంతో.. ఈ భారీ అంకెలు తేలిపోతున్నట్లుగా చెబుతున్నారు. అందుకే రూ.4200 కోట్ల పెట్టుబడుల లెక్కలు అందరిని ఆకర్షిస్తున్నాయి. కేటీఆర్ ను గెలుపు గుర్రం మీద కూర్చోబెట్టుస్తున్నాయని చెబుతున్నారు.
Tags:    

Similar News