మంత్రి ప‌ద‌వి లేకున్నా కేటీఆర్ వ‌దిలిపెట్ట‌డం లేదుగా

Update: 2019-02-01 18:21 GMT
అమెరికాలో తెలుగు విద్యార్థుల అరెస్ట్ క‌ల‌క‌లం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నకిలీ పత్రాలతో అమెరికాకు వెళ్లి అక్కడ చదువు పేరుతో ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయ‌డం - అందులో మెజార్టీ తెలుగు విద్యార్థులు ఉండ‌టం వార్త‌ల్లో నిలుస్తోంది. హోమ్‌ ల్యాండ్ డిపార్ట్‌ మెంట్‌ కు చెందిన ఇమ్మిగ్రేష‌న్స్ శాఖ అండ‌ర్‌ క‌వ‌ర్ ఆప‌రేష‌న్‌ తో డెట్రాయిట్ పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కు 130 మంది విదేశీ విద్యార్థుల‌ను అరెస్టు చేశారు. విద్యార్థుల‌కు అక్ర‌మంగా వీసాలు ఇప్పించిన 8 మంది ద‌ళారీల‌ను కూడా అరెస్టు చేశారు. ఈ ఎపిసోడ్‌ పై టీఆర్‌ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట‌య్యారు.

యూఎస్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డాతో స‌మావేశ‌మైన‌ టీఆర్‌ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాలపై చ‌ర్చించారు. అమెరికా వీసా ఫ్రాడ్‌ కు సంబంధించిన కేసులో అరెస్టయిన తెలుగు రాష్ర్టాలకు సంబంధించిన విద్యార్థులను విడిపించేలా కృషి చేయాలని ఆమెను కోరారు.  ఫేక్ యూనివర్సిటీ ఫ్రాడ్‌ లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థుల గురించి కేథరిన్‌ తో కేటీఆర్ చర్చించారు. వారిని విడిపించేందుకు యూఎస్ ప్రభుత్వంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. దీనికి తోడుగా తెలంగాణ-యూఎస్ సంబంధాల గురించి చర్చించారు. కాగా, మంత్రి ప‌ద‌విలో లేకున్నా త‌న దూకుడును కేటీఆర్ ఆప‌డం లేద‌ని, గ‌తంలో ఎన్నారై వ్య‌వ‌హారాల మంత్రిగా ప‌నిచేసిన కేటీఆర్ త‌న దూకుడు కొన‌సాగిస్తున్నార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

ఇదిలాఉండ‌గా, న‌కిలీ వీసాలు పొంది - ఇమ్మిగ్రేష‌న్ రూల్స్‌ను ఉల్లంఘించిన 130 మంది విదేశీ విద్యార్థుల‌ను అరెస్టు చేసిన‌ట్లు ఐసీఈ ప్ర‌తినిధి కారిసా క‌ట్రెల్ తెలిపారు. అరెస్టుల సంఖ్య మునుముందు పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దేశ‌వ్యాప్తంగా అల్లుకుపోయిన వీసా ద‌ళారుల‌ను ప‌ట్టుకునేందుకు అమెరికా భారీ ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది. అక్ర‌మ ప‌ద్ధ‌తిలో అమెరికాకు వ‌చ్చి, ఆ త‌ర్వాత ఫ‌ర్మింగ్ట‌న్ వ‌ర్సిటీలో చేరిన విద్యార్థుల‌ను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. వాస్త‌వానికి ఫ‌ర్మింగ్ట‌న్ వ‌ర్సిటీ ఓ ఫేక్ అని, దాన్ని అమెరికా పోలీసులే త‌మ అండ‌ర్‌క‌వ‌ర్ ఆప‌రేష‌న్ కోసం వినియోగించిన‌ట్లు తేలింది. ఫెడ‌ర‌ల్ నియ‌మావ‌ళి ప్ర‌కారం పూర్తి స్థాయి కోర్సులో చేరని విద్యార్థుల‌ను అద‌పులోకి తీసుకుంటున్న‌ట్లు ఐసీఈ వెల్ల‌డించింది. బాధిత విద్యార్థులు హోమ్‌ల్యాండ్ సెక్యూర్టీ అధికారుల‌తో మాట్లాడ‌వ‌చ్చు అని అమెరికా అధికారులు తెలిపారు.


Tags:    

Similar News