మొత్తం మోడీ టు నడ్డా, బండి సంజయ్.. బీజేపీని కడిగేసిన కేటీఆర్

Update: 2022-01-06 07:31 GMT
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని "రైతు వ్యతిరేకి" అని అభివర్ణించారు. పంజాబ్‌లో రైతుల నిరసనతో ప్రధాని మోడీ ఫ్లై ఓవర్ ఘటనలో చిక్కుకుపోయిన సంఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దేశంలో ఆయన ఈ రోజు ఏ స్థితిలో ఉన్నారో ఈ ఘటన తెలియజేస్తుందని మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు.

"పంజాబ్‌లో ప్రధాని కాన్వాయ్‌ను 20 నిమిషాలకు పైగా రోడ్డుపై నిలిపివేశారు. దేశంలో ఈరోజు మోడీ ఎక్కడ ఉన్నారో ఇది తెలియజేస్తోంది" అని టిఆర్‌ఎస్ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ర్యాలీలో ప్రసంగించేందుకు ఫిరోజ్‌పూర్‌కు వెళుతున్నప్పుడు భటిండాలో మోడీ ఇలా ఫ్లైఓవర్ రోడ్డుపై చిక్కుకున్నారు. ఆ రహదారిపై రైతులు ఆందోళన చేయడంతో వెనుదిరగాల్సి వచ్చింది.

‘భారతదేశంలో మరే ప్రధానికి ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు’ అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన విమర్శలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ఆరోపించారు. 2022 నాటికి ప్రతి కుటుంబానికి ఇల్లు, ప్రతి ఇంటికి నీరు, విద్యుత్ కనెక్షన్లు, మరుగుదొడ్లు కల్పిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

భారతదేశంలో అభివృద్ధిని వదిలేయండి.. ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా ఇలా జరగడం మనం చూడలేదని, ఆయన తన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని కేటీఆర్ అన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోదీ హామీ కాగితాల్లోనే మిగిలిపోయిందని కేటీఆర్‌ అన్నారు.

2022 నాటికి దేశంలో బుల్లెట్ రైళ్లు నడపటం బీజేపీకి మరో 'జుమ్లా' అని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీని 'బక్వాస్ జుమ్లా పార్టీ'గా అభివర్ణించిన ఆయన, తమ ఏడున్నరేళ్ల పాలనలో చేసింది అంతా 'జుమ్లా అండ్ హమ్లా' అని ఆరోపించారు. బీజేపీ పాలనలో దేశంలో "అత్యధిక నిరుద్యోగిత రేటు, అత్యధిక ద్రవ్యోల్బణం, అత్యధిక ఇంధన ధరలు.. అత్యధిక సంఖ్యలో పరిశ్రమలు మూతపడుతున్నాయి" అని కేటీఆర్ ఎత్తిచూపారు. ఎన్‌డీఏలో బీజేపీ భాగస్వాములు విడిపోతే వారిపై సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ తో దాడి చేయిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు.

చౌక, నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నందుకు బీజేపీ నాయకత్వంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "వారు దేశంలో మతపరమైన కల్లోలం సృష్టించి ఓట్లు పొందాలని మాత్రమే కోరుకుంటున్నారు." అని తీవ్ర విమర్శలు చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మానసిక సమతుల్యం కోల్పోయారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించడంపై టీఆర్‌ఎస్ నేత మండిపడ్డారు. నడ్డాకే పిచ్చెక్కిందని కేటీఆర్ అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను “కేసీఆర్‌కి ఏటీఎం” అని నడ్డా పిలవడంపై, టీఆర్‌ఎస్ నాయకుడు పార్లమెంటులో నిలదీశాడు. జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు అవినీతికి “ఎటువంటి సందర్భాలు” లేవని పేర్కొన్నారని ఎత్తి చూపారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుగా పేరొందిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అందరి నుంచి ప్రశంసలు లభించాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. నడ్డాకు మతిస్థిమితం లేకుండా పోయిందని, స్థానిక బీజేపీ నేతలు తనకు ఇచ్చినవన్నీ చదువుతున్నాడని ఆయన అన్నారు.

బీజేపీ ‘పనికిరాని’ పాలనను చూసి ఉత్తరప్రదేశ్, బీహార్ (నడ్డా జన్మస్థలం) నుంచి తెలంగాణకు బతుకుదెరువు కోసం వలస వస్తున్నారని కేటీఆర్ హైలైట్ చేశారు. కాగా, తెలంగాణలో కుటుంబ పాలన అంటూ నడ్డా చేసిన ప్రకటనకు కౌంటర్ ఇస్తూ తాము ప్రజల చేత ఎన్నుకోబడ్డామని, తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన చరిత్ర తమదని కేటీఆర్ అన్నారు. రాజకీయాల్లో బహుళ కుటుంబ సభ్యులు ఉన్న బీజేపీ నేతల పేర్లను కూడా తీసుకొని కేటీఆర్ ఎండగట్టారు.

96.8 శాతం ఓడీఎఫ్ గ్రామాలతో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా, తమిళనాడు రెండో స్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడా కనిపించడం లేదన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను బీజేపీ కాపీ కొడుతుందని కేటీఆర్ అన్నారు. 'కిసాన్ సమ్మాన్ నిధి' 'రైతు బంధు'కి ప్రతిరూపమని, 'హర్ ఘర్ జల్ యోజన' 'మిషన్ భగీరథ'కి ప్రతిరూపమని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నప్పుడు తల పగులకొట్టుకోవడం కనిపించిందని ఆరోపించారు. "బండి సంజయ్ మతిస్థిమితం కోల్పోయాడు. నడ్డా అతనికి మద్దతు ఇవ్వడానికి వచ్చాడు. ఇది అవివేకం. వారి ఐక్యూ విషయానికి వస్తే నడ్డా సంజయ్ మధ్య తేడా లేదు" అని కేటీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డాడు.


Tags:    

Similar News