అలాంటి వాటికీ కేటీఆర్ కు కోపం వస్తుందా?

Update: 2016-04-22 04:40 GMT
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కోపం వచ్చింది. అయితే.. ఈ కోపం రాజకీయ ప్రత్యర్థుల మీద కాదు. బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న జనాల మీదా. ఇలాంటి కోపాలు కూడా కేటీఆర్ లో వస్తుంటాయా? అన్న ఆశ్చర్యం అక్కర్లేదు. తామే ప్రోత్సహించే అంశాల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేయటం కాస్త కొత్తగా అనిపించినా.. పరిస్థితుల ప్రభావం అని సరిపెట్టుకోవాల్సిందే. ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా నగరం అందంగా లేకుండా పోతుందన్న బాధ కేటీఆర్ కు వచ్చేసింది.

ఎందుకిలా అంటే.. సిటీ మొత్తం హోర్డింగులు.. పోస్టర్లు.. కటౌట్లతో నిండిపోయిందని.. ఇలాంటి వాటితో సిటీ లుక్ దెబ్బ తింటోందని ఆయన చెబుతున్నారు. ఇలాంటి కటౌట్లు మహానగరి ఇమేజ్ ను దెబ్బ తీస్తాయని కూడా వాపోతున్నారు. అనుమతి లేని పోస్టర్లు.. హోర్డింగులు తొలగించాలని ఆయన తాజాగా ఆదేశించారు కూడా. అయితే.. ఇలాంటి ఆదేశాలు ఇప్పటికే న్యాయస్థానాలు పలుమార్లు ఇచ్చినా ఇప్పటివరకూ మార్పు వచ్చింది లేదు.

పాలకులుగా కోర్టు ఆదేశాల్ని పక్కాగా అమలు చేసినా.. అధికారులు అలా వ్యవహరించేలా జాగ్రత్తలు తీసుకున్నా కేటీఆర్ కు కటౌట్ల మీద కోపం వచ్చేది కాదు. కానీ.. ఇప్పటివరకూ కటౌట్లు.. హోర్డింగుల విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరించిన కేటీఆర్ కు ఉన్నట్లుండి అంత కోపం ఎందుకన్నది కాస్త ఆసక్తికరమే. నగరంలో ఏర్పాటు చేసే కటౌట్లు.. ఫ్లెక్సీలలో చాలావరకూ అధికారపక్షానికి చెందినవేనన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందరూ మారాలంటున్న కేటీఆర్ కు.. అసలు ఆ అవసరం లేదని.. తమ పార్టీ నేతల మైండ్ సెట్ మారితే చాలావరకూ ఇష్యూ సెటిల్ అవుతుందని చెప్పే దమ్ము.. ధైర్యం ఎవరికి ఉంది. ఏ గల్లీలోకి వెళ్లినా అధికారపక్షానికి చెందిన కటౌట్లు.. పోస్టర్లే ఎక్కువగా కనిపిస్తాయన్న విషయం కేటీఆర్ కు అవగాహన ఉంటే.. ఆయనకు కోపం వచ్చేది కాదేమో..?
Tags:    

Similar News