యాస సెంటిమెంట్ ను బ‌య‌ట‌కు తీసిన కేటీఆర్!

Update: 2018-10-28 04:37 GMT
తెలంగాణ రాష్ట్ర తాజా మాజీ మంత్రి కేటీఆర్ భావోద్వేగ అంశాల్ని అస్త్రాలుగా తీసుకొని ఎన్నిక‌ల  ప్ర‌చారానికి మ‌రింత‌ ప‌దును పెట్టే పనిలో బిజీబిజీగా ఉన్నారు. తాజాగా ఆయ‌న యాస అస్త్రాన్ని తెర మీద‌కు తీసుకొచ్చారు. త‌మ‌కు ప‌రిస్థితులు.. ప‌రిణామాలు అనుకూలంగా లేనంత‌నే సెంటిమెంట్ ను తెర మీద‌కు తెచ్చే టీఆర్ ఎస్ నేత‌ల స్టైల్లోనే కేటీఆర్ తాజాగా అడుగులు వేస్తున్నారు.

ఎట్టి ప‌రిస్థితుల్లో 100సీట్ల‌కు త‌గ్గ‌కుండా విజ‌యం సాధిస్తామ‌న్న న‌మ్మ‌కాన్ని ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌ద‌ర్శిస్తున్న వేళ‌.. గ్రౌండ్ లెవ‌ల్లో ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉన్న నేప‌థ్యంలో.. బాబు వ్య‌తిరేక వ్యూహాన్ని ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు తీసుకున్నారు టీఆర్ ఎస్ ముఖ్య‌నేత‌లు.

నాలుగున్న‌రేళ్ల కేసీఆర్ ప‌ద‌వి కాలంలో పూర్తి చేసిన ప‌నుల్ని ఒక్కొక్క‌టిగా ప్ర‌చారం చేసుకుంటున్న గులాబీ నేత‌ల స్వ‌రంలో తేడా ఇప్పుడు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ముంద‌స్తుకు వెళ్లే వేళ‌లో వాతావ‌ర‌ణం త‌మ‌కు పూర్తి అనుకూలంగా ఉంద‌న్న ధీమాతో ఉన్న కేసీఆర్.. ఆ కాన్ఫిడెన్స్ తోనే ముంద‌స్తుకు వెళ్లార‌ని చెప్పాలి. ఎప్పుడైతే తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు కావ‌టంతో ప‌రిస్థితుల్లో మార్పు వ‌చ్చిన ప‌రిస్థితి.

తాజాగా చోటుచేసుకుంటున్న ప‌రిణామాల నేప‌థ్యంలో తెలంగాణ అధికార‌ప‌క్షంపై సానుకూల‌త అంత‌కంత‌కూ త‌గ్గుతున్న ప‌రిస్థితి ఉంద‌న్న నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌తో కేసీఆర్‌.. కేటీఆర్ లు అలెర్ట్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. అందుకే.. త‌మ ప్ర‌సంగాల్లో బాబు  ఎంట్రీని ప్ర‌స్తావించ‌టం.. తెలంగాణ‌లో మ‌హా కూట‌మికి అధికారం వ‌స్తే.. నిర్ణ‌యాల‌న్నీ అమ‌రావ‌తికి వెళ్లి డిసైడ్ చేసుకోవాల‌ని.. చివ‌ర‌కు తెలంగాణ సొమ్మును అమ‌రావ‌తికి త‌ర‌లి వెళుతుంద‌న్న మాట‌ల్ని కేటీఆర్ చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్ప‌టికే ఆంధ్రా.. తెలంగాణ అంటూ సెంటిమెంట్‌ ను రాజేసే ప్ర‌య‌త్నం చేస్తున్న కేసీఆర్.. తాజాగా ఆయ‌న కుమారుడు కేటీఆర్ ఇదే ఎజెండాతో త‌న ప్ర‌సంగాన్ని సిద్ధం చేసుకోవ‌టం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ లేని తెలంగాణ‌ యాస‌ను ప్ర‌స్తావించారు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో అన్ని కులాల వారు ఇబ్బందులు ప‌డ్డార‌ని.. కానీ.. త‌మ ప్ర‌భుత్వంలో అలాంటి ప‌రిస్థితి లేద‌ని.. అన్ని కులాల్ని గౌర‌వించుకున్న వైనాన్ని గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేశారు. అంతేకాదు.. ఉమ్మ‌డి పాల‌న‌లోని సినిమాల్లో విల‌న్ల యాస‌ను తెలంగాణ పెట్టేవార‌ని.. ఇప్పుడు అదే యాస‌ను హీరోల‌కు పెడుతున్న వైనాన్ని గుర్తు చేశారు. ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఈ త‌ర‌హా భావోద్వేగంతో కూడిన ప్ర‌చారం ఏ మాత్రం ప్ర‌భావాన్ని చూపించద‌న్న మాట‌ను కొంద‌రు చెబుతున్నారు.

మ‌రికొంద‌రు మాత్రం తెలంగాణ‌లో ఎప్ప‌టికి ఆంధ్రా వ్య‌తిరేక‌త అన్న‌ది ఒక అస్త్ర‌మ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌ని చెబుతున్నారు. కాకుంటే.. తెలుగు సినిమాల్లో చిల‌క‌లూరి పేట అంటే చిన్న‌బోయేలా సీన్లు పెట్ట‌టం.. సిక్కోలు యాస‌ను క‌మేడియ‌న్లు.. అమాయ‌కుల‌కు పెట్ట‌టం లాంటి వాటి గురించి సీమాంధ్ర నేత‌లు ఎవ‌రూ ప‌ట్టించుకోని ప‌రిస్థితి.

ఇలాంటివేమీ ప్ర‌చారానికి రాక‌పోవ‌టం.. కేటీఆర్ లాంటోళ్లు మాట్లాడిన మాట‌ల‌న్ని మీడియాలోకి రావ‌టంతో విప‌క్షాల‌తో పోలిస్తే.. టీఆర్ ఎస్ అంతో ఇంతో పైచేయిని సాధించింద‌ని చెబుతున్నారు. అందుకే భావోద్వేగ క‌త్తిని యాస పేరుతో నూరితే మ‌రింత ప‌దునెక్కుతోంద‌న్న‌ది టీఆర్ఎస్ నేత‌ల వ్యూహంగా  తెలుస్తోంది. సో.. రానున్న రోజుల్లో ఈ భావోద్వేగ సెంటిమెంట్లు అంత‌కంత‌కూ ఎక్కువ కావ‌టం ఖాయ‌మంటున్నారు.


Tags:    

Similar News