చిప్ప‌కూడు తిన్న రేవంత్ మాట్లాడుతారా?

Update: 2018-01-13 16:12 GMT
విద్యుత్ వివాదం తెలంగాణ‌లో కొన‌సాగుతోంది. విద్యుత్తు కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధినేత‌ కే చంద్రశేఖర రావుపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కే తార‌క‌ రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రైతులకు 24 గంటల విద్యుత్తు సరఫరా ప్రారంభమైనప్పటి నుంచి టిఆర్ ఎస్ - కాంగ్రెసు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విద్యుత్తు కొనుగోళ్లలో అవినీతి చోటు చేసుకుందని, అందులో కేసీఆర్ ప్రమేయం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు. విద్యుత్తు కొనుగోళ్లలో అవినీతిపై చర్చకు ఎక్కడైనా తాను చర్చకు సిద్ధంంగా ఉన్నానని, ప్రభుత్వం సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.  మ‌రోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి నేత‌లు దీనిపై క్లారిటీ ఇస్తున్నారు. ఇలా తెరాస- కాంగ్రెసు నేతల మధ్య సాగుతున్న వివాదంపై ఎట్టకేలకు మంత్రి కేటీఆర్‌ స్పందించారు.  

వ్యవసాయానికి 24 గంటల కరెంట్ పంపిణీ విజయవంతం కావడంతో కాంగ్రెసు నేతలకు కడుపు మండుతోందని కేటీఆర్ అన్నారు. జైలులో చిప్పకూడు తిన్నవాళ్లు కూడా అవినీతి గురించి మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదని ప‌రోక్షంగా రేవంత్‌పై భారీ సెటైర్ వేశారు. విద్యుత్తు కొనుగోళ్లలో అవినీతిపై చర్చకు ఎక్కడైనా తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వం సిద్ధమా అని రేవంత్ రెడ్డి విసిరిన దానిపై కేటీఆర్ స్పందించారు. అవినీతి నాయకుడి సవాళ్లకు తాము స్పందించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని అంటున్న ప్రతిపక్ష నాయకులు ఆధారాలు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలని కేటీఆర్‌ చెప్పారు. అసెంబ్లీలో చర్చిద్దామంటే పారిపోతారు. బయట రచ్చ చేస్తారని మంత్రి మండిపడ్డారు.

రాష్ట్రంలో టీఆర్ ఎస్ స్థిరపడితే ఎప్పటికీ అధికారంలోకి రాలమనే భయం కాంగ్రెసుకు పట్టుకుందని, అందువల్లనే ఆ పార్టీ నాయకులు ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. కరెంట్ కొనుగోలు ఆరోపణలపై ఆధారాలుంటే కోర్టుకు వెళ్లవచ్చునని ఆయన అన్నారు. పంచాయితీరాజ్ చట్టంపై పూర్తిస్థాయిలో చర్చ జరుగుతోందని, పర్యావరణ అనుమతులు రాగానే ఫార్మాసిటీ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. తాను విదేశాలకు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళుతున్నానని, పారిశ్రామికవేత్తలతో పెట్టుబడుల సమీకరణ, ఒప్పందాలు ఉన్నాయని, ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటానని తెలిపారు.
Tags:    

Similar News