పెళ్ల‌యినా న‌న్ను రాహుల్‌ తో ఎలా పోలుస్తారు?

Update: 2017-07-17 12:56 GMT
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో త‌న‌ను పోల్చ‌డం చిత్రంగా ఉందని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ త‌న‌యుడైన మంత్రి కేటీఆర్ అన్నారు. సంక్షేమ పథకాలపై త‌మ ప్ర‌శ్న‌కు సమాధానం చెప్పలేని కాంగ్రెస్ నేత‌లు తనను బచ్చా అన‌డం వింత‌గా ఉంద‌ని కేటీఆర్ అన్నారు. పెళ్లి అయిన త‌ను బ‌చ్చా అయితే....ఇప్ప‌టికీ పెళ్లి కాని రాహుల్ బచ్చా కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు నెం.1 శత్రువు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఆయ‌న పున‌రుద్ఘాటించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ ఎస్వీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్సేనని... తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ నినాదాన్ని అణచివేయాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడేమో తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుంటుందని నిప్పులు చెరిగారు. తెలంగాణకు మేలు చేయాలనుకున్న ఏ నేతను కాంగ్రెస్ ముందుకుపోనివ్వ‌లేద‌ని గుర్తు చేశారు. కాంగ్రెస్ తెలంగాణను దయాదాక్షిణ్యాలతో ఇవ్వలేదు.. తెలంగాణ ఇవ్వకపోతే వీపు చింతపండు అవుతుందనే భయంతోనే కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిందన్నారు. ఈ మూడేళ్ల కాలంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు.

ఉద్యమ సమయంలో టీఆర్‌ ఎస్వీ సైన్యంగా పని చేసిందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు కూడా బంగారు తెలంగాణ కోసం టీఆర్‌ఎస్వీ పని చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు నాయకత్వం వహించేది విద్యార్థులే అని పేర్కొన్నారు. జ్ఞానం కోసం చదువు.. జనం కోసం నడువు అని మంత్రి పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉద్ఘాటించారు. జయశంకర్ సార్ లేని లోటు ఎవరూ తీర్చలేనిదన్నారు. ఏ అంశంలో సందేహాన్నైనా నా నివృత్తి చేసే ఎన్‌సైక్లోపీడియా జయశంకర్‌సార్ అని కేటీఆర్ తెలిపారు . ఇంటింటికీ మంచి నీళ్లు ఇవ్వాలనే ఆలోచన గతంలో ఏ సీఎంకు గుర్తు రాలేదన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇంటింటికీ మంచి నీళ్లు ఇచ్చేందుకు మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆనాడు ఒక్క చిత్తూరు జిల్లాలో మంచినీళ్ల పథకానికి రూ. 9 వేల కోట్లు ఖర్చు అయితే తెలంగాణలో 31 జిల్లాల తాగునీటికి రూ. 43 వేల కోట్లు ఖర్చు కావా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఎప్పుడొచ్చామన్నది కాదు.. సబ్జెక్ట్ ఉందా.. లేదా అన్నది ఇంపార్టెంట్ అన్నారు. కాంగ్రెస్ కు కాంట్రాక్టర్లు - సబ్ కాంట్రాక్టర్లు - బిల్లులు తప్ప మరేం కనిపించవు అని ధ్వజమెత్తారు. మిషన్ భగీరథ అద్భుతమైన కార్యక్రమం అని నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రా లకు లేఖ రాసిన విషయాన్ని  మంత్రి గుర్తు చేశారు. మిషన్ కాకతీయను ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించిందని తెలిపారు.
Tags:    

Similar News