కేటీఆర్ కుమార్తెకు దోమకాటు తప్పలేదట!

Update: 2019-09-10 05:25 GMT
పురపాలక.. మున్సిపల్ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాతి రోజునే జీహెచ్ఎంసీలో నగర సమస్యలపై అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా నగర సమస్యలపై యుద్ధాన్ని ప్రకటించారు. తనతో సహా ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలు.. మేయర్.. కార్పొరేటర్లు.. జీహెచ్ఎంసీ కమిషనర్.. ఉప కమిషనర్లు.. సహాయ కమిషనర్లతో సహా అధికారులు.. ప్రజాప్రతినిధులు తెల్లవారుజామున 5.30 గంటల నుంచే దోమల నివారణ మీద అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనాలని వెల్లడించారు.

అన్ని జ్వరాలు డెంగీ ఎంతమాత్రం కాదని.. దోమకాటుతో హైదరాబాద్ మహానగరంలో ముప్పు అంచున ఉందన్న రీతిలో మీడియాలో వార్తలు రావటాన్ని ఆయన తప్పు పట్టారు. విష జ్వరాల మీద కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్లు చెప్పిన ఆయన.. తన ఇంట్లోనూ దోమకాటుతో ఇబ్బంది పడినట్లు చెప్పారు. తన కుమార్తెకు దోమకాటు తప్పలేదని.. ఈ కారణంగా వైరల్ ఫీవర్ వచ్చినట్లుగా చెప్పటం గమనార్హం.

తాము స్వైన్ ఫ్లూ అనుకున్నామని.. కాదని తర్వాత తేలిందన్నారు. దోమల నివారణ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మంత్రి కేటీఆర్ మాటలు వింటే.. అంత పెద్ద ప్రగతి భవన్ లో ఉన్నా.. దోమల నుంచి.. దోమకాటు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారా? అన్న డౌట్ రాక మానదు. అంత పెద్ద కేటీఆర్ కుమార్తెకే దోమకాటు తప్పలేదంటే.. మనలాంటోళ్లంటే దోమలకు ఒక లెక్కా?  


Tags:    

Similar News