పార్టీకి ఓనర్ అన్న మాట ఎంత డేంజరో చెప్పిన కేటీఆర్

Update: 2019-09-12 06:32 GMT
కొన్నింటికి కట్టడి విధించాల్సిన అవసరం ఉంది. మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చాక నేతల నోటికి తాళాలు వేయటం అంత తేలికైన విషయం కాదు. ఈ విషయం జాతీయ రాజకీయపార్టీలకు.. ప్రాంతీయ పార్టీలకు మధ్య వ్యత్యాసం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. జాతీయ పార్టీలకు చెందిన నేతలకు అంతర్గత స్వాతంత్య్రం ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే ఎక్కువే. ఈ కారణంతో తరచూ వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.

అదే సమయంలో ప్రాంతీయపార్టీల్లో  జరిగే పరిణామాలపై మాట్లాడే స్వేచ్ఛ నేతలకు చాలా పరిమితంగా ఉంటుంది. అంతర్గత స్వేచ్ఛ కూడా తక్కువే. ఈ కారణంతోనే జాతీయ పార్టీల నేతలతో పోలిస్తే.. ప్రాంతీయపార్టీల నేతల నోటి నుంచి వచ్చే వివాదాస్పద వ్యాఖ్యలు తక్కువగా ఉంటాయి. గతంలో ఎప్పుడూ లేని రీతిలో టీఆర్ఎస్ కు చెందిన నేతలు పలువరు తమకు తోచినట్లుగా మాట్లాడుతున్న వైనం గడిచిన కొద్ది రోజులుగా సంచలనంగా మారింది.

నేతల మాటలపై పార్టీ మౌనంగా ఉండి.. చూద్దామన్నట్లుగా వ్యవహరించటం.. ఆ మాటల తీవ్రత అంతకంతకూ పెరగటం తెలిసిందే. మంత్రి ఈటల విషయానికే వస్తే.. గులాబీ పార్టీకి ఓనర్లం మేమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఆ తర్వాత నుంచి పలువురు గులాబీ నేతలు పార్టీని తమ సొంత ఆస్తిలా ఫీలవుతూ.. పార్టీకి తామే ఓనర్లమంటూ ప్రకటించటం తెలిసిందే.

గులాబీ పార్టీకి ఓనర్లు తామేనంటూ గులాబీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు చెక్ పెట్టే తొలి ప్రకటన మంత్రి కేటీఆర్ నోటి నుంచి వచ్చింది. తాజాగా ఆయన పార్టీ నేతల్ని ఉద్దేశించిన చేసిన ప్రసంగంలో ఓనర్ల మాటపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సూటిగా వార్నింగ్ ఇచ్చేశారు. ఓనర్ల మాట ఇకపై పార్టీలో నిషేదాక్షరం అన్నట్లుగా ఆయన తాజా మాటలు ఉండటం గమనార్హం.

ఆస్తులకు ఓనర్లు ఉంటారే తప్పించి ఆస్తిత్వాలకు కాదని.. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ప్రతీక టీఆర్ఎస్ పార్టీ అని.. ఎవరికి వారు తానే ఓనర్ అని మాట్లాడటం సరికాదని తేల్చేశారు. అంతేకాదు.. పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని ఏ మాత్రం సహించలేమని స్పష్టం చేశారు. ఎంతటి వారైనా సరే.. ఉపేక్షించేది లేదన్న ఆయన.. క్రమిశిక్షణను ఉల్లంఘించటం డెంగీ వ్యాధి కంటే డేంజరన్నారు. 

మంత్రివర్గ విస్తరణపై నేతలు తమకు తోచినట్లుగా మీడియాతో మాట్లాడుతున్నారని.. అదేమాత్రంమంచిది కాదన్న ఆయన.. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే.. వారిని టీఆర్ ఎస్ కార్యకర్తలు ప్రశ్నించాలన్నారు. చివరకు తాను మాట్లాడినా కూడా కార్యకర్తలు ప్రశ్నించొచ్చన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజలదని.. పార్టీ యజమానులం తామేనని చెప్పి ఎవరు చులకన చేసే ప్రయత్నం చేయొద్దాన్నారు. మొత్తానికి పార్టీకి ఓనర్లమన్న మాట ఎంత డేంజరన్న మాటతో పాటు.. మరెంత ప్రమాదకరమన్న విషయాన్ని కేటీఆర్ తేల్చేశారని చెప్పక తప్పదు.


Tags:    

Similar News