పవర్ లో ఉన్న కేటీఆర్ కు.. పీకే గురించి ఇంకా తెలీకపోవటమా?

Update: 2022-04-23 09:30 GMT
తెలివి తనొక్కడి సొత్తు అనుకుంటేనే సమస్యంతా. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్నారా? అన్న భావన కలిగేలా చేస్తోంది. అన్ని నాకు తెలుసు అన్నట్లుగా మాట్లాడే ఆయన.. వెనుకా ముందు చూసుకోకుండా ప్రధానమంత్రి మోడీ.. కేంద్రమంత్రి అమిత్ షాతో పాటు ఎవరినైనా డోన్ట్ కేర్ అన్నట్లుగా విరుచుకుపడుతున్నారు. మాంచి జోరు మీద ఉన్న కేటీఆర్.. ఆ మాత్రం దూకుడు చూపించకుంటే ఏం బాగుంటుందని కేటీఆర్ అనుకోవచ్చు కానీ.. ఇలాంటివి తనను అడ్డంగా బుక్ చేస్తాయన్న విషయాన్ని ఆయన ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపిక చేసుకున్నకొన్ని మీడియా సంస్థలకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే క్రమంలో కొన్నింటి విషయాల్లో కాస్తంత నేర్పును ప్రదర్శించిన ఆయన.. మరికొన్ని విషయాల్లో మాత్రం తనకున్న అనుభవలేమిని ప్రదర్శించారని చెప్పాలి.

గతంలో ఎక్కడైనా ఏదైనా పరిణామం చోటు చేసుకుంటే.. దాని గురించిన వివరాల్ని తెలుసుకోవటానికి.. కాస్తంత సమయం తీసుకునేది. ఇప్పుడు కాలం మారింది.దానికి తోడు విపరీతమైన వేగం పెరిగింది. చీమ చిటుక్కుమన్నా తనకు తెలియాలన్నట్లుగా వేగుల్ని సెట్ చేసుకోవటంలో టీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ తర్వాత కేటీఆర్ తన సత్తా చాటుతుంటారని చెబుతారు.

అలాంటి కేటీఆర్ ను తాజాగా ఒక ఇంటర్వ్యూలో.. సీఎం కేసీఆర్ చెబుతున్న ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఎప్పుడు తెర మీదకు వస్తుందన్న సందేహాన్ని వ్యక్తం చేస్తూ.. సీఎం కేసీఆర్ కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సత్ సంబంధాలు ఉన్నాయన్న ఆయన.. ప్రత్యామ్నాయ కూటమికి సంబంధించిన వివరాలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటిస్తారన్నారు. ఈ మాటల్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇబ్బందంతా పీకే గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతోనే.

కాంగ్రెస్ తో జత కట్టేందుకు పీకే ప్రయత్నిస్తున్నారు కదా.. మరోవైపు పీకేతో టీఆర్ఎస్ పని చేస్తుంది కదా? ఇది ప్రత్నామ్నాయ కూటమికి అటంకంగా మారదా? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో దొరికిపోయారు కేటీఆర్. కాంగ్రెస్ తో సమావేశమవుతున్నారని పత్రికల్లో చూస్తున్నామని.. వాస్తవం ఏమిటో తెలిశాక.. ఏం చేయాలో ఆలోచిస్తామన్న మాటను చెప్పిన తీరు విస్తుపోయేలా చేయటం ఖాయం.ఫోన్ బటన్ దూరంలో ఉండే పీకే..కాంగ్రెస్ నేతలతో భేటీ కావటం రోజువారీ కార్యక్రమంగా సాగటమే కాదు.

 కాంగ్రెస్ విజయం కోసం ఏమేం చేయాలన్న రిపోర్టు ఇవ్వటం.. ఆ వివరాలు బయటకు వచ్చిన తర్వాత కూడా.. మీడియాలో చూస్తున్నాం.. వాస్తవం ఏమిటో తెలిశాక నిర్ణయం అంటూ అమాయకంగా మాటలు చెప్పే కేటీఆర్ తీరు ఆయన్ను అడ్డంగా బుక్ చేసిందని చెబుతున్నారు. పత్రికల్లో చూసే బదులు పీకేను నేరుగా అడగలేని పరిస్థితుల్లో కేసీఆర్.. కేటీఆర్ ఉన్నారా? అన్న సందేహం కలుగకమానదు. నిజాన్ని దాచే ప్రయత్నంలో చెప్పే మాటలు ఇలానే దొరికిపోయేలా చేస్తాయన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News