అమెరికా టూర్ లో కేటీఆర్ అలా దూసుకెళుతున్నారట

Update: 2022-03-23 05:06 GMT
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పెట్టుబడుల కోసం.. ప్రముఖ కంపెనీలను హైదరాబాద్ కు తీసుకురావటం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఆయన కారణంగా మూడు ప్రముఖ కంపెనీలు తెలంగాణకు వచ్చేందుకు ఓకే చెప్పటమే కాదు.. తాము పెట్టే పెట్టుబడి లెక్కల్ని చెప్పేశారు.

తాజా టూర్ లో మంత్రి కేటీఆర్ సాధించిన గొప్ప విజయం ఏదైనా ఉందంటే.. అది ఐటీ.. వైర్ లెస్ టెక్నాలజీ.. సెమీ కండక్టర్ రంగాల్లో అంతర్జాతీయ దిగ్గజంగా పేరున్న క్వాల్కమ్ సంస్థను హైదరాబాద్ కు తీసుకురావటంగా చెప్పాలి.

అమెరికా తర్వాత తమ సంస్థకు చెందిన రెండో అతి పెద్ద ప్రాంగణాన్ని హైదరాబాద్ కు తెచ్చేందుకు వారుఓకే చెప్పటంతో పాటు.. వచ్చే అక్టోబరుకు ప్రారంభిస్తామని చెప్పారు. అంతేకాదు.. రూ.3904 కోట్ల పెట్టుబడుల్ని ఈ సంస్థ హైదరాబాద్ లో పెట్టనుంది.

ఈ సంస్థ రానున్న ఐదేళ్ల వ్యవధిలో 8700 మంది ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తామని.. 15.72 లక్షల చదరపు అడుగుల్లో కొత్త ఆఫీసును ఓపెన్ చేయనున్నట్లుగా పేర్కొంది. ఐటీతో పాటు వ్యవసాయ.. విద్యా రంగాల్లో తెలంగాణలో అవకాశాల్ని అందిపుచ్చుకోవటమే తమ విస్తరణ ప్రణాళిక లక్ష్యంగా పేర్కొన్నారు.

అమెరికాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ గోల్ప్ క్రీడాపరికరాల తయారీ సంస్థ "కాల్ అవే గోల్ఫ్"  సంస్థ అమెరికా తర్వాత అతి పెద్ద డిజిటల్ టెక్నాలజీ కేంద్రాన్ని హైదరాబాద్ లో పెట్టేందుకు ఓకే చెప్పేసింది. ఇందుకు రూ.150కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సముఖత వ్యక్తం చేసింది. దీంతో 300 మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు.

దీంతో పాటు ప్రముఖ విద్యుత్ వాహనాల సంస్థ ఫిస్కర్ ఐఎన్ సీ సంస్థ సైతం తమ ఐటీ డెవలప్ మెంట్ కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పేసింది. ఈ సంస్థ రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఏడాది వ్యవధిలో కార్యకలాపాలు షురూ అయ్యే ఈ సంస్థ కారణంగా 300 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొత్తంగా తాజా టూర్ లో భారీ ఎత్తున పెట్టుబడుల హామీలతో తెలంగాణకు తిరిగి రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News