గుజ‌రాత్ లాంటి ఇమేజ్ కోరుకుంటున్న కేటీఆర్‌

Update: 2018-05-13 05:24 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ త‌న శాఖ విష‌యంలో పూర్తి స్ప‌ష్ట‌త‌తో ఇంకా చెప్పాలంటే భ‌విష్య‌త్ గురించి భారీ ల‌క్ష్యాల‌ను ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతార‌నే టాక్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఐటీ రంగంలో త‌న‌దైన ముద్ర వేసేందుకు ఇప్ప‌టికే కేటీఆర్ టీహ‌బ్‌, ఇమేజ్ ట‌వ‌ర్‌, మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా ఆవిష్క‌ర‌ణ‌ల కేంద్ర‌మైన వీహ‌బ్‌ను ఏర్పాటుచేశారు. ప‌లు బ‌డా కంపెనీలను రాష్ర్టానికి ర‌ప్పించ‌డంలో ఐటీ మంత్రి కేటీఆర్ స‌ఫ‌ల‌మ‌య్యార‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే తాజాగా కేటీఆర్ ఇంకో భారీ టార్గెట్‌ను పెట్టుకున్నారు. అదే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌రాష్ట్రమైన గుజ‌రాత్ స్థాయిలో తెలంగాణ‌ను అభివృద్ధి చెందించ‌డం.

అదేంటి ప‌లు సంద‌ర్భాల్లో గుజ‌రాత్ మోడ‌ల్‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేయ‌డ‌మే కాకుండా తెలంగాణ మోడ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌ను దేశ‌వ్యాప్తం చేస్తామ‌ని ప్ర‌క‌టించిన కేటీఆర్ తిరిగి అదే గుజరాత్ మోడ‌ల్ జ‌పం చేయ‌డం ఏంట‌ని ఆలోచిస్తున్నారా? అదే ట్విస్ట్‌. కేటీఆర్ గుజ‌రాత్‌ను ఆద‌ర్శంగా తీసుకున్న‌ది అక్క‌డి ప‌రిపాల‌న‌ను కాదు...అక్క‌డి ప్ర‌జ‌ల ఆలోచ‌న తీరును. అక్క‌డి వ్యాపార సంస్కృతిని. తెలంగాణ ప్ర‌జ‌ల్లో అలాంటి స్ఫూర్తే రావాల‌ని కోరుకోవ‌డం. స్ప‌ష్టంగా చెప్పాలంటే...వ్యాపారం చేయ‌డంలో గుజ‌రాతీలు ఎలాంటి నైపుణ్యాలు క‌లిగి ఉంటారో...ఆవిష్క‌ర‌ణ‌ల్లో తెలంగాణ అంత‌టి ఇమేజ్‌ను సాధించాల‌ని కేటీఆర్ కోరారు.

వివిధ విభాగాలకు చెందిన ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు మంత్రి కేటీఆర్ తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇన్నోవేషన్ సెల్ ఫెలోషిప్ ప్రోగ్రాంకు ఎంపికైన వారితో ముచ్చ‌టించిన సంద‌ర్భంగా కేటీఆర్ ప‌లు ఆలోచ‌న‌లు, ల‌క్ష్యాల‌ను పంచుకున్నారు. ``ప్రస్తుత పరిస్థితుల్లో ఆవిష్కరణలు చాలా ముఖ్యమైనవి. వీటి ద్వారా ఉత్పాదకత పెరిగి ఖర్చు తగ్గుతుంది. వేతనంలో పెరుగుదల ఉంటుంది. తమ పౌరుల జీవన విధానాలను అనేక దేశాలు ఇదే విధంగా మెరుగుపర్చాయి. రాష్ట్రంలో బలమైన ఆవిష్కరణ వేదికను ఏర్పాటుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా మేం రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్‌ను ఏర్పాటుచేశాం. దేశంలోనే ఇది మొదటిది. వ్యాపారవేత్తలకు గుజరాత్ చిరునామాగా ఎలా మారిందో తెలంగాణను ఆవిష్కర్తలకు వేదికగా చేయడం తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ప్రధాన లక్ష్యం.`` అంటూ త‌న గోల్‌ను స్ప‌ష్టంగా కేటీఆర్ వివ‌రించారు.
Tags:    

Similar News