ఆ ఇష్యూ తేల్చాలంటూ కేంద్రానికి కేటీఆర్ ఘాటు లేఖ‌

Update: 2017-08-14 05:07 GMT
కేంద్ర తీరుపై తెలంగాణ రాష్ట్ర స‌ర్కారుకు అసంతృప్తి అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. ఒక‌టి కాదు రెండు కాదు.. ప్ర‌తి విష‌యంలోనూ కేంద్రం త‌మ‌ను తొక్కేస్తుంద‌న్న భావ‌న ఈ మ‌ధ్య‌న ఎక్కువైన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ మ‌ధ్య‌నే అమ‌లు షురూ అయిన జీఎస్టీ కార‌ణంగా రాష్ట్రానికి భారీ భారం ప‌డుతుంద‌న్న విష‌యాన్ని తెర మీద‌కు తీసుకొచ్చి.. ఆ విష‌యంలో త‌మ‌కు న్యాయం చేయాల‌ని పోరాడుతున్న తెలంగాణ రాష్ట్రం.. తాజాగా మ‌రో అంశంపై క్లారిటీ ఇస్తారా?  లేదా? అంటూ సూటిగానే లేఖ‌ను సంధించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌.

తెలంగాణ‌కు ఐటీ పెట్టుబ‌డుల ప్రాంతం మీద స్ప‌ష్ట‌త ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరుతున్నారు. ప్రాజెక్టును ప్ర‌క‌టించి నాలుగేళ్లు అవుతున్నా.. ఇప్ప‌టివ‌ర‌కూ పైసా సాయం రాలేద‌న్న మాట‌ను చెబుతున్నారు. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌ర అభివృద్ధి సంస్థ ప‌రిధిలోని 202 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఐటీఐఆర్ ను ఏర్పాటు చేస్తున్న విభ‌జ‌న‌కు ముందే.. నాటి కాంగ్రెస్ స‌ర్కారు ప్ర‌క‌టించ‌టం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స‌మ‌గ్ర ప్రాజెక్టు నివేదిక‌ల్ని రాష్ట్ర స‌ర్కారు సిద్ధం చేసింది. తొలి విడ‌త‌లో రూ.3275 కోట్లు.. మౌలిక వ‌స‌తుల కోసం రూ.3110 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పేసింది. అయితే.. పేరుకు నిధుల‌కు ఓకే అన్నా.. కేంద్రం నుంచి రాష్ట్రానికి మాత్రం పైసా రాలేద‌ని చెబుతున్నారు.

ఈ విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ల‌టంతో పాటు.. నిధుల విడుద‌ల కోసం ప‌లువురు కేంద్ర‌మంత్రులతో స‌మావేశ‌మైంది తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు. అయితే.. భేటీ అయిన ప్ర‌తిసారీ సానుకూలంగా స్పందిస్తూనే.. నిధుల విడుద‌ల మీద హామీల మీద హామీలు ఇవ్వ‌టమే త‌ప్పించి ప్రాక్టిక‌ల్ మాత్రం అలాంటిదేమీ లేక‌పోవ‌టంపై మంత్రి కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా కేంద్రం తీరును ప్ర‌శ్నిస్తూ ఘాటు లేఖ‌ను కేంద్ర ఐటీశాఖా మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌కు రాశారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఐటీ వృద్ధికి ఊతం ఇచ్చే ఐటీఐఆర్ ప్రాజెక్టు స్టేట‌స్ తెలియ‌జేయాల‌ని కోరుతూనే.. ఐటీ రంగంలో త‌మ స‌ర్కారు ఎంత‌లా వృద్ధి సాధించింద‌న్న విష‌యాన్ని కేటీఆర్ త‌న లేఖ‌లో తెలియ‌జేయ‌టం విశేషం. ఓప‌క్క నిధుల సాయాన్ని కోరుతూనే.. మ‌రోవైపు కేంద్రం నుంచి స‌హ‌కారం లేకున్నా తెలంగాణ ప్ర‌భుత్వం ఈ రంగంలో దూసుకెళుతుంద‌న్న మాట‌ను గ‌ణాంకాల రూపంలో ప్ర‌ద‌ర్శించ‌టం గ‌మ‌నార్హం. మంత్రి కేటీఆర్ లేఖ చూస్తుంటే.. రానున్న రోజుల్లో కేంద్రానికి చెక్ పెట్టేందుకు వీలుగా ముంద‌స్తుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న‌ట్లుగా క‌నిపించ‌కమాన‌దు.
Tags:    

Similar News