కేటీఆర్:ఎందుకు తిడ‌తారో? ఎందుకు క‌లుస్తారో?

Update: 2022-06-09 04:41 GMT
రాజ‌కీయాల్లో ద్విముఖ వ్యూహం మంచిదా ! కాదా ! అన్న‌ది అటుంచితే కొన్ని సార్లు నాయ‌కుల ప‌రిప‌క్వ‌త‌కు అవే మేలు చేస్తాయి. కొన్నిసార్లు అప‌రిప‌క్వ ధోర‌ణికి అవే కార‌ణం అవుతాయి. దావోస్ వెళ్లి వ‌చ్చాక తొలిసారి కేంద్ర ఐటీ శాఖ పెద్ద‌ల‌తో కేటీఆర్ భేటీ కావ‌డం ఓ విధంగా రాజ‌కీయ వ‌ర్గాల‌లో ఆస‌క్తి రేపుతోంది. ఢిల్లీ కేంద్రంగా జ‌రిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి ప‌లు అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో

తెలంగాణ‌లో విభిన్నం అయిన ప‌రిణామాలు నెల‌కొని ఉన్నాయి. ఉన్నంత మేర‌కు కేటీఆర్ లాంటి వారు పెట్టుబ‌డుల కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాలు బాగానే ఉన్నా, కేంద్రంతో ప్ర‌తీసారీ క‌య్యాలు అన్న‌వి అంత‌గా హేతుబ‌ద్ధంగా, ఆలోచింప‌జేసేవిగా లేవు అన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. టామ్ అండ్ జెర్రీ వార్ గానే ఉంది కానీ వీటిలో సీరియెస్‌నెస్ లేదు అన్న వాద‌న కూడా ఉంది. అందుకే కేటీఆర్ ఏం మాట్లాడినా కేంద్రం పెద్ద‌గా సీరియ‌స్-గా తీసుకోవ‌డం లేదు అన్న అభిప్రాయం ఒక‌టి స్ప‌ష్ట‌మైన రీతిలో వ్య‌క్తం అవుతూ ఉంది.

అందుకే తెలంగాణ బీజేపీ త‌ర‌ఫున కూడా నాయ‌కులెవ్వ‌రూ పెద్ద‌గా నోరేసుకుని ప‌డిపోతున్న దాఖ‌లాలు కూడా లేవు. బండి సంజ‌య్ మాట్లాడుతూ ఉన్నా అవేవీ పెద్ద‌గా మీడియాలో ఫోక‌స్ కావ‌డం లేదు అన్న‌ది కూడా వాస్త‌వ‌మే ! ఎందుకంటే ఓ వైపు తిడుతూనే మరో వైపు ఢిల్లీ పెద్ద‌ల‌తో తెలంగాణ ప్ర‌భుత్వ పెద్ద‌లు స‌ఖ్య‌త కోరుకుంటున్నార‌న్న‌ది ఓ విమ‌ర్శ. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఇటువంటి ద్వంద్వ వైఖ‌రి కార‌ణంగా రాజ‌కీయంగా ఒడ్డెక్కాల‌ని ఆలోచించడం కేసీఆర్ చూపిస్తున్న ప‌రిణితికి సంకేతం అని ప‌రిశీల‌కులు అంటున్నారు.

వాస్త‌వానికి కేంద్రం ఏమీ ఇవ్వ‌డం లేద‌ని చెబుతూనే కేంద్ర మంత్రుల‌తో త‌రుచూ భేటీ అవుతున్నారు కేటీఆర్. ఐటీ శాఖకు సంబంధించి ప్ర‌తి అప్డేట్ ను కేంద్రానికి వివ‌రిస్తూనే ఉన్నారు. అంటే వీలున్నంత వ‌ర‌కూ స‌ఖ్య‌త‌ను కోరుకుని ముందుకు వెళ్లాల‌నే భావిస్తున్నారు. తెల్లారితే బీజేపీకి  కొత్త నిర్వ‌చ‌నాల‌ను వెతికే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఇప్ప‌టికిప్పుడు పైకి చూపించినంత కోపం, ద్వేషం లోప‌ల అదేవిధంగా ఉంచుకోవ‌డం సాధ్యం కాని ప‌ని ! అందుకే ఎప్ప‌టిక‌ప్పుడు ఢిల్లీ పెద్ద‌ల‌తో మాట్లాడేందుకే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నారు కేటీఆర్.

సంప్ర‌తింపుల ద్వారా స‌మ‌స్య‌లు పరిష్క‌రించుకోవాల‌ని యోచిస్తున్నారు అన్న‌ది కూడా సుస్ప‌ష్టం. అదే ప‌నిగా కేంద్రాన్ని తిడుతూ పోయినా రుణాల విష‌య‌మై అంత వేగంగా కేంద్రం అంగీకారం ల‌భించ‌దు. ఇప్ప‌టికే నాలుగు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల అప్పుతో రాష్ట్రం న‌డుస్తోంది. ముందున్న కాలంలోనూ అప్పుల‌తోనే నెట్టుకు రావాలి. క‌నుక ఈ స‌మ‌యంలో ఆర్థిక స‌మ‌స్య‌లు నుంచి ఒడ్డెక్కాలంటే కొంత క‌య్యం కొంత వియ్యం అన్న ధోర‌ణినే పాటించాలి. ప్ర‌ద‌ర్శించాలి కూడా ! అదే ఇప్పుడు చేస్తున్నారు కేటీఆర్.

నిన్న‌టి వేళ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఈ భేటీకి ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు స‌మ‌న్వ‌యక‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు.. భారత ఎలాక్ట్రానిక్, మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలో ఉన్న అవకాశాలపై కేంద్రమంత్రితో కేటీఆర్ చర్చించారు. పారిశ్రామికవేత్తలకు ఎంతో అనుకూలమైన ఎకోసిస్టమ్ ను సృష్టించేందుకు కృషి చేస్తున్నామని కేంద్రమంత్రికి  కేటీఆర్ వివరించారు అని ప్ర‌ధాన మీడియా చెబుతోంది. ఈ భేటీలో మాజీ స్పీక‌ర్ , ప్ర‌స్తుత ఎంపీ సురేశ్  రెడ్డి కూడా పాల్గొన్నారు.
Tags:    

Similar News