ఆపిల్ సీఈవోకు కొత్త ప్ర‌పోజ‌ల్ పెట్టిన కేటీఆర్‌

Update: 2016-05-19 09:32 GMT
టెక్నాల‌జీ దిగ్గజం ఆపిల్ సంస్థ ఆపిల్ మ్యాప్స్ డెవ‌ల‌ప్‌ మెంట్ సెంట‌ర్‌ ను హైదరాబాద్‌ లో ప్రారంభించింది. నగరంలోని వేవ్‌ రాక్ భవనంలో ఈ కేంద్రాన్ని ఆపిల్  సీఈవో టిమ్ కుక్  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ - ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిమ్‌ కుక్ మాట్లాడుతూ.. ఐ లవ్ ఇండియా అని సంబోధించి భారత పర్యటన చాలా ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్‌ లో కొత్త కార్యాలయం ప్రారంభిస్తున్నందుకు చాలా ఉద్వేగంగా ఉందన్నారు. ఇక్కడి యువత - నైపుణ్య సామర్థ్యాలు ఆపిల్‌ కు ఉపయోగపడుతాయన్నారు.

 ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆపిల్ మ్యాప్స్ కేంద్రం హైదరాబాద్‌ లో ఏర్పాటు చేయ‌డం తమకు గర్వకారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆపిల్ మ్యాప్ కేంద్రం ద్వారా వేలాది ఉద్యోగాలు లభిస్తాయని సీఎం పేర్కొన్నారు. టిమ్‌ కుక్ - సీఎంతో కలిసి కేటీఆర్ సెల్ఫీ దిగారు. అనంత‌రం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ...ఆపిల్ ద్వారా 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి అన్నారు. వచ్చే ఏడాది నాటికి ఆపిల్ సొంత క్యాంపస్‌ కు స్థలం కేటాయిస్తామని ఈ సంద‌ర్భంగా  ఆఫ‌ర్ ఇచ్చారు. డిజిటల్ తెలంగాణ ప్రాజెక్టులో భాగంగా ఆపిల్‌ తో ఒప్పందం కుదుర్చుకుంటామని కేటీఆర్ ప్ర‌క‌టించారు. త‌మ ఆవిష్క‌ర‌ణల కేంద్రం టీ-హబ్‌ తో కలిసి పని చేయడానికి ఆపిల్ ఆస‌క్తి చూపించాలని కేటీఆర్ కోరారు.

టీఎస్ ఐపాస్ - ఐటీ విధాన ప్రతులను టిమ్‌ కుక్‌ కు మంత్రి కేటీఆర్ అందించారు. ఆపిల్ సంస్థ అమెరికా వెలుపల నెల‌కొల్పే కేంద్రానికి హైదరాబాద్‌ ను వేదిక‌గా చేసుకుంది. ఆపిల్ ఐఫోన్ - ఐప్యాడ్ - మ్యాక్ కంప్యూటర్లు - ఆపిల్ వాచ్‌ ల మ్యాప్‌ ల అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రం కానుంది. నాలుగు వేల మందికి ఆపిల్ హైదరాబాద్ సంస్థలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Tags:    

Similar News