త‌ల‌సాని దూకుడుకి కేటీఆర్ బ్రేక్ వేసారుగా!

Update: 2019-08-04 04:10 GMT
తలసాని శ్రీనివాసయాదవ్. తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు ప్రముఖంగా వినిపించేదే. టీడీపీ సీనియర్ నేతగా ఉన్న ఆయన 2014లో సనత్‌ నగర్ నియోజకవర్గం నుంచి ఇదే పార్టీ సింబల్‌ పై పోటీ చేసి విజయం సాధించారు. అయితే తర్వాత జరిగిన రాజకీయ పెను మార్పుల కారణంగా ఆయ‌న‌ కేసీఆర్ గూటికి చేరి జై తెలంగాణ అన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కేసిఆర్ మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇక గత ఏడాది డిసెంబరులో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు.

ఈ దఫా టీఆర్ ఎస్ గుర్తు పైనే పోటీ చేసి విజయం సాధించిన తలసానికీ.. మరోసారి కెసిఆర్ మంత్రిగా ఛాన్స్‌ ఇచ్చారు. అయితే, నిజానికి కేసీఆర్ రెండోసారి మంత్రి పదవి ఇచ్చే విషయంలో చాలా మందిని పక్కన పెట్టారు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని పలు విధాల వడపోత నిర్వహించి ఎంపిక చేశారు. అయినప్పటికీ.. తలసాని విజయం సాధించి కేసీఆర్ మనసు దోచుకుని రెండోసారి కూడా మంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆ విజయ గర్వంతోనే ఆయన దిగువస్థాయి నేతల పై పైచేయి సాధించాలని చూస్తున్నార‌న్న టాక్ టీఆర్ ఎస్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌ లో తన హవా పెంచుకునేందుకు ప్రయత్నించారు. తనకు సంబంధం లేకపోయినా కొన్ని విషయాల్లో జోక్యం చేసుకుని అంతా తానే అనే ధోరణిని ప్రదర్శించారు. ఈ విషయంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ - సిఎం తనయుడు కేటీఆర్‌ కు ఫిర్యాదులు కూడా అందాయి. అయితే, దీనిని ఆయన నేరుగా చెప్పకుండా మరికొందరు కూడా ఇలానే ప్రవర్తిస్తుండడంతో వారిని పిలిచి క్లాస్ ఇచ్చారు. ``మీకు ఎంతవరకు అధికారం ఉందో అంతవరకు చూసుకోండి. అవసరం లేని విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు. ఎవరి పని వారు చెయ్యండి`` అని కేటీఆర్ చెప్పడంతో ఒక్కసారిగా అందరూ అలెర్ట్ అయి ఎవ‌రి ప‌నివారు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఇదే విషయం తన చెవిని కూడా పడడంతో తలసాని కూడా అలెర్ట్ అయ్యారు. ముఖ్యంగా రాజధానిలోని కార్పొరేషన్ మేయర్ విధుల్లో తాను ఇప్పటి వరకూ చేసుకున్న జోక్యాన్ని తగ్గించుకోవడంతో పాటు - మేయర్ బొంతు రామ్మోహన్ కు ఎక్కడ అవమానం - ఆగ్రహం కలగకుండా ప్రవర్తిస్తున్నారని సమాచారం. మొన్న లోక్‌ స‌భ ఎన్నిక‌ల్లో త‌ల‌సాని కొడుకు సాయికిర‌ణ్‌కు సికింద్రాబాద్ ఎంపీ సీటు వ‌చ్చాక త‌ల‌సాని మ‌రింత‌గా పేట్రేగిపోయార‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి.

నిజానికి నిన్న మొన్నటి వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మేయర్ పాల్గొనాల్సిన కార్యక్రమాలు - చేయాల్సిన సమీక్షలు కూడా త‌ల‌సాని చేసేసారు. బోనాల పండుగ ఏర్పాట్లు - డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయం పై అధికారులతో సమీక్షలు వంటి కీలక విషయాల్లోనూ ఆయన వేలు పెట్టారు. అయితే ఇది నిజంగా ఆయన పరిధిని దాటి నా విషయమే. దీంతో కేటీఆర్‌ కు ఫిర్యాదులు వెళ్లాయి. అయితే తాజాగా కేటీఆర్ ఇతర నేతలకు వార్నింగ్‌ లు ఇవ్వడంతో తలసాని స‌ర్దుకున్నారని దూకుడు తగ్గించారని అంటున్నారు. మొత్తానికి కర్ర విరగకుండానే పామును అదుపులోకి తెచ్చార‌ని ఇప్పుడు కేటీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు బొంతు వర్గీయులు.


Tags:    

Similar News