ఇప్పుడు హ‌డావుడి చేస్తే నో యూజ్ కేటీఆర్

Update: 2017-06-08 10:19 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయ వార‌సుడిగా అప్ర‌క‌టితంగా డిసైడ్ అయిన మంత్రి కేటీఆర్ ఎంత‌గా దూసుకెళుతున్నారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఓవైపు త‌న‌కు అప్ప‌గించిన శాఖ‌ల్ని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్న ఆయ‌న‌.. మ‌రోవైపు త‌ర‌చూ విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఇమేజ్‌ ను అంత‌కంత‌కూ పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఒక ప‌ట్టాన అంతుబ‌ట్ట‌ని ప్ర‌ముఖ కంపెనీల‌ను ఒప్పించి.. మెప్పించి వారిని తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టేలా చేస్తున్న మంత్రి కేటీఆర్ ప‌ని తీరును ఎవ‌రూ వంక‌బెట్ట‌లేరు. మ‌రి.. ఇంత స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేసే ఆయ‌న‌.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ముచ్చ‌ట వ‌చ్చేస‌రికి మాత్రం త‌ప్పులో కాలేయ‌టం క‌నిపిస్తుంది.

కొద్దికాలం క్రితం గ్రేట‌ర్ ను వ‌ర్షం భారీగా ముంచెత్తి రోడ్లు మొత్తం చిత్త‌డిగా త‌యారై.. గుంత‌లు.. గుంత‌లుగా మారిపోవ‌టంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీన్ని సెట్ చేసేందుకు.. ప‌గ‌లు.. రాత్రి అన్న తేడా లేకుండా స‌ర్ ప్రైజ్ విజిట్స్ చేసినా ఎలాంటి ఫ‌లితం లేక‌పోయింది. ప‌దిహేను రోజుల్లో వ్య‌వ‌స్థ‌ను సెట్ చేస్తాన‌ని చెప్పిన ఆయ‌న‌.. చేయ‌లేక కామ్ అయిపోయారు. చివ‌ర‌కు మూడు నాలుగు నెల‌ల‌కు కానీ ప‌రిస్థితిని ఒక‌కొలిక్కి తీసుకొచ్చారు. నిజంగా వ్య‌వ‌స్థ‌ను క‌దిలించ‌టం అంత క‌ష్ట‌మైన ప‌నా? అంటే లేద‌న్న‌ది గ‌తం తాలూకు అనుభ‌వం చెప్పేది.

అదెలానంటే.. ఉమ్మ‌డి రాష్ట్రంలో చివ‌రి ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన కిర‌ణ్‌ కుమార్ రెడ్డికి ఇలాంటి ప‌రిస్థితే ఒక‌సారి ఎదురైంది. వ‌ర్షాల‌తో హైద‌రాబాద్ రోడ్లు మొత్తం నాశ‌న‌మైపోయాయి. రోడ్ల మీద గుంత‌ల‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి.

దీనిపై ఆగ్ర‌హం చెందిన ఆయ‌న అప్ప‌ట్లో అధికారుల‌కు అల్టిమేటం జారీ చేసి.. వారంలో ప‌నులు జ‌ర‌గ‌క‌పోతే.. చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. అంతే.. యుద్ధ‌ప్రాతిప‌దిక మీద అధికార‌గ‌ణం ఉరుకులు ప‌రుగులు పెట్టి.. చెప్పిన టైంకి ప‌ని పూర్తి చేశారు. అది గ‌తం. వ‌ర్త‌మానానికి వ‌స్తే.. కిర‌ణ్ కుమార్ తో పోలిస్తే.. కేటీఆర్ మ‌రింత ప‌వ‌ర్ ఫుల్‌. కానీ.. అధికారుల్ని ప‌రుగులు పెట్టించి ప‌ని చేయించ‌టంలో మాత్రం ఆయ‌న వెనుక‌ప‌డిపోయార‌న్న వాద‌న వినిపిస్తోంది.

హైద‌రాబాద్ న‌గ‌ర బాధ్య‌త‌ను తీసుకున్న ఆయ‌న‌.. వ‌ర్షాకాలానికి నెల ముందే ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? అధికారుల స‌న్న‌ద్ధ‌త ఎలా ఉంద‌న్న విష‌యం మీద ఆరాతీయాలి. తేడా వ‌స్తే.. తోలు తీస్తాన‌న్న రీతిలో హెచ్చ‌రిక‌లు చేయాలి. రోడ్ల మీద నీళ్లు నిల‌వ‌కుండా ఏం చేయాల‌న్న దానిపై భారీగా క‌స‌ర‌త్తు చేసి.. గ‌తంతో పోలిస్తే ఎంతోకొంత మెరుగుద‌ల‌ను ప్ర‌ద‌ర్శిస్తే బాగుండేది.

అలాంటిదేమీ లేక‌పోగా.. గ‌తం కంటే అధ్వానంగా ప‌రిస్థితి ఉండ‌టంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు ఉద‌యం నాలుగు గంట‌ల పాటు కురిసిన వాన‌తో హైద‌రాబాద్ న‌గ‌రం మొత్తం నీటి మ‌యం అయిన‌ట్లుగా అయిపోయింది. ఎక్క‌డిక‌క్క‌డ నీరు నిలిచిపోయి.. ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గురి కావ‌ట‌మే కాదు.. ప‌ల్ల‌పు ప్రాంతాల్లో భారీ ఎత్తున నీరు నిలిచిపోయింది. భారీ ట్రాఫిక్ జాంల‌కు తెర తీసింది. వాన‌ కార‌ణంగా ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్న వేళ‌.. రంగంలోకి దిగిన కేటీఆర్ హ‌డావుడి చేస్తున్న వైనం చూస్తే.. ఇంత‌కాలం కేటీఆర్ ఏం చేసిన‌ట్లు? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు.

ప‌రిస్థితి దారుణంగా మారిన త‌ర్వాత హ‌డావుడిగా సీన్లోకి వ‌చ్చిన మంత్రి కేటీఆర్‌.. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా ప‌నులు చేప‌ట్టాలంటూ చెప్ప‌టం చూసిన‌ప్పుడు న‌వ్వు రాక మాన‌దు. తమ ప్ర‌భుత్వాన్ని స‌మ‌ర్థ‌త‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా చెప్పుకునే కేటీఆర్‌.. తాజా ప‌రిస్థితిని ఎవ‌రిని నిందిస్తారు? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. తాను నిర్వ‌హించే మిగిలిన శాఖ‌ల ప‌ని తీరు ఎలా ఉన్నా.. హైద‌రాబాద్ ను సెట్ చేయ‌టం అంత తేలికైన విష‌యం కాద‌న్న విష‌యాన్ని మంత్రి కేటీఆర్ ఇప్ప‌టికైనా గుర్తిస్తే మంచిది. లేదంటే.. ఆయ‌న‌కున్న స‌మ‌ర్థ‌త‌ను హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం అస‌మ‌ర్ధుడ్ని చేస్తుంద‌న్న విష‌యాన్ని ఆయ‌న తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News