కేటీఆర్ ఆదేశాలు ఇక్కడ పనిచేయవా..?

Update: 2021-10-25 09:30 GMT
అధికారంలో ఉన్న నాయకులు ఒక్కోసారి సంచలన నిర్ణయాలు తీసుకుంటారు. వారు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు మేలు చేసినప్పుడు ఆ నిర్ణయాలను ప్రజలకు కూడా స్వాగతిస్తారు. అంతేకాకుండా ఇటువంటి నిర్ణయాల పట్ల సదరు నాయకులపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. తెలంగాణలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి అంతటి ప్రాధాన్యత కలిగిన వ్యక్తి కేటీఆర్. కేసీఆర్ కు కుమారుడైనా కేటీఆర్ ది ప్రత్యేక శైలి. ఒక్కోసారి ఆయన ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమాలపై కేసీఆర్ సైతం అభినందిస్తుంటారు. ఒక ఎమ్మెల్యేగా కేటీఆర్ సరైన నిర్ణయం తీసుకుంటాడని కేసీఆర్ పలు సార్లు కొనియాడారు. అయితే ఇటీవల కేటీఆర్ తీసుకున్న ఓ నిర్ణయంతో సొంత పార్టీ నాయకులు సైతం హడిపోయారు. అంతేకాకుండా ఈ విషయంలో కేటీఆర్ చాలా కఠినంగా కూడా వ్యవహరించారు. కానీ..

ప్లాస్టిక్ భూతంపై కొన్నేళ్లుగా ప్రభుత్వాలు తీవ్ర పోరాటం చేస్తున్నాయి. తెలంగాణలో కవర్ల వాడకాన్ని నిషేధించడం మొదలుకొని ఫ్లెక్సీలను ఏర్పాటు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. నిబంధనలు కాదని ఎవరైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే భారీ జరిమానాలు విధిస్తుంది. సొంత పార్టీనేతలైనా సరే జరిమానా విధించాలని కేటీఆర్ ఆదేశించడంతో అధికార పార్టీ నాయకులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది మార్చిలో ఇల్లెందులో పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు పురపాలక సంఘం చైర్మన్ కు రూ. లక్ష ఫైన్ విధించారు. అలాగే జహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లైక్సీలపై భారీ ఫైన్ వేసేలా ఆదేశాలు జారీ చేశారు.

కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు సైతం అధికార పార్టీ నాయకులు అని కూడా చూడకుండా ఫైన్లు వేసేస్తున్నారు. ఇటీవల హుజూరాబాద్ నేత కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిన సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ కొరడా విధించింది. ఏకంగా లక్ష వరకు జరినామా వేసింది. అయితే ‘సొంత పార్టీ నాయకులైనా సరే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే జరిమానా వేస్తాం. కొత్త సంవత్సరంలో సరికొత్తగా ముందుకు వెళ్దాం.. గోడలపై రాతలు, ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు కనిపిస్తే పబ్లిక్ ఢిఫెస్ మెంట్ యాక్ట్ కు కచ్చితంగా అమలు చేస్తాం.. అధికార పార్టీ నాయకులపైనా జరిమానాలు విధిస్తాం...’ అని వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తు రూ. 50 వేల ఫైన్ విధించారు. ఆ తరువాత తన పుట్టిన రోజు సందర్భంగా ఎలంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని పార్టీ కార్యకర్తలను కోరారు.

అయితే ఇప్పుడు హైదరాబాద్ నగరమంతా ఫ్లెక్సీలు, హోర్గింగ్ లతో నిండిపోయింది. ఈనెల 25న టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా విగ్రహాలు, కూడళ్లు వదలకుండా టీఆర్ఎస్ బ్యానర్లతో నింపేశారు. నగరమంతా ఎక్కడా చూసినా గులాబీ ఫ్లెక్సీలు, బ్యానర్లే కనిపిస్తున్నాయి. దీంతో కొందరు ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ ఆదేశాలు ఇప్పుడు పనిచేయవా..? అంటూ విమర్శిస్తున్నారు. అప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పిన వారే ఇప్పుడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని అంటున్నారు. ఒకవేళ ఫిర్యాదు చేద్దామనుకున్నా అధికార పార్టీకి చెందిన వారు కాబట్టి పెద్దగా చర్యలేమి ఉండవని కొందరు అంటున్నారు. అయితే ఇలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై కేటీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.. ఒకప్పుడు అధికార పార్టీ నాయకులపైనా చర్యలు తీసుకుంటామని చెప్పిన కేటీఆర్ ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆదేశాలు జారీ చేయడం లేదని అంటున్నారు. అయితే కేటీఆర్ ఆదేశాలు జారీ చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదా..? లేక కేటీఆర్ ఈ విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారా..? అని చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News