కేటీఆర్‌ జోస్యం.. జోడో యాత్ర ఎంట‌ర్ అయ్యే టైంకి.. కాంగ్రెస్ ఎంపీలు జంప్!!

Update: 2022-10-08 07:29 GMT
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతున్నాయి, ఆయ‌న తాజాగా కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ.. ఇద్ద‌రు ఎంపీలు.. ఆ పార్టీని వీడి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకురెడీగా ఉన్నా రని చెప్పారు. అంతేకాదు.. పార్టీ అగ్ర‌నేత ఎంపీ రాహుల్‌గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర తెలంగాణ‌లో కి అడుగు పెట్టే స‌మ‌యంలో ఈ ఇద్ద‌రు ఎంపీలు.. ఆ పార్టీకి, రాహుల్‌కు కూడా.. షాకిస్తార‌ని.. కేటీఆర్ జోస్యం చెప్పారు. అయితే.. ఆ ఇద్ద‌రు ఎవ‌రు?  ఏ పార్టీలోకి జంప్ చేస్తారు? అనే విష‌యాల‌ను మాత్రం కేటీఆర్ వెల్ల‌డించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ పూర్తిగా విఫ‌ల మైంద‌ని విమ‌ర్శించారు. దీంతో జాతీయ రాజ‌కీయాల్లో ఒక శూన్య‌త ఆవ‌రించింద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ తీవ్ర విప‌త్క‌ర ప‌రిస్థితిలో ఉంద‌ని.. దీనిని ఎదుర్కొని నిల‌వ‌గ‌ల‌గ‌డం అత్యంత క‌ష్ట‌సాధ్య‌మ‌ని అన్నారు.

"కాంగ్రెస్ ఇక ఎంతోకాలం బ‌తికి ఉంటుంద‌నినేను అనుకోవ‌డం లేదు. దేశాన్ని గ‌త 50 ఏళ్ల‌పాటు పాలించిన పార్టీ ఇప్పుడు 50 మంది ఎంపీల స్థాయికి దిగ‌జారిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఇది ఒక‌టికి ప‌డిపోయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు" అని అన్నారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా త‌యారైంద‌ని, ఎన్నిక‌ల్లో పోటీ చేసే స‌త్తా కూడా లేకుండా పోయింద‌ని అన్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ స‌వాళ్ల‌ను అధిగ‌మించ‌లేక చ‌తికిల‌ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌న్నారు.

"నేటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ఉనికి లేదు. నిజానికి ఇప్పుడు ఈ దేశానికి అతిపెద్ద పార్టీ అవ‌స‌రం ఉంది. కానీ, ఆ ప‌రిస్థితిని కాంగ్రెస్ కోల్పోయింది.  ఈ విషయం చెప్పడానికి నేను చింతిస్తున్నాను, కానీ వారు ఈ ప‌రిస్థితిలోనే ఉన్నారు. బీజేపీతో కాంగ్రెస్‌ ప్రత్యక్షంగా పోటీ చేసిన చోట ఓట‌మినేచ‌విచూస్తున్నారు" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

రాహుల్ చేస్తున్న భార‌త్ జోడో యాత్ర‌పై స్పందిస్తూ.. నిజానికి ఇప్పుడు కావాల్సింది.. 'కాంగ్రెస్ జోడో' యాత్ర అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎందుకంటే.. ఎక్క‌డిక‌క్క‌డ‌ పార్టీనేత‌ల్లో స‌ఖ్య‌త‌లేద‌ని అన్నారు.  రాహుల్ కేర‌ళ‌లో న‌డిచారని, కానీ, అదేస‌మ‌యంలో గోవాలో ఆయ‌న పార్టీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లిపోయారని చెప్పారు.  పార్టీ అధ్య‌క్షుడిగా రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌ను చేయాల‌ని భావించారు. అయితే.. అక్క‌డ కూడా ముస‌లం పుట్టింద‌ని చెప్పారు.

దీనిని బ‌ట్టి పార్టీపై గాంధీల కుటుంబం ప‌ట్టు కోల్పోయింద‌నే చెప్పాల్సి ఉంటుంద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎవ‌రూ గాంధీల‌ను లెక్క‌చేయ‌డం లేదన్నారు. రాహుల్ త్వ‌ర‌లోనే 15 రోజుల పాటు తెలంగాణ‌లో పాద‌యాత్ర చేయ‌నున్నార‌నే అంశంపై మాట్లాడుతూ.. ఆయ‌న 15 నెల‌లు పాద‌యాత్ర చేసినా.. ఇక్క‌డ ఎలాంటి మార్పునూ తీసుకురాలేర‌ని చెప్పారు.

క‌ర్ణాట‌క‌లో పాద‌యాత్ర చేసినా.. మార్పు రాలేదని.. తెలంగాణలోనూ అంతేన‌ని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప‌గ్గాల‌ను శ‌శి థ‌రూర్ చేప‌ట్టినా.. మ‌ల్లికార్జున ఖ‌ర్గేచేప‌ట్టినా.. ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని.. అంతా మునిగిపోయే నావ ఎక్కేందుకు ఉబ‌లాట‌ప‌డుతున్న‌వారేన‌ని దుయ్య‌బ‌ట్టారు. దేశం ఈ దుస్థితిలోకి దిగ‌జారి పోవ‌డానికి కాంగ్రెసే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని దుయ్య‌బ‌ట్టారు.  కాంగ్రెస్ ఏ మొహం పెట్టుకుని.. ప్ర‌జ‌ల్లోకి వ‌స్తుంద‌ని నిల‌దీశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News